Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి...ఇక బ‌డిలో పాఠ్యాంశం కానీ...

By:  Tupaki Desk   |   24 July 2017 5:20 AM GMT
అమ‌రావ‌తి...ఇక బ‌డిలో పాఠ్యాంశం కానీ...
X
అమ‌రావ‌తి...నవ్యాంధ్రప్ర‌దేశ్‌ రాజధాని క‌ల‌ల‌ న‌గ‌రం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమరావ‌తి అంటే ఎంత మ‌మ‌కారమో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌న ఘ‌న‌త‌గా అమరావ‌తిని చెప్పుకునేందుకు బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. రాజ‌ధాని నిర్మాణం ఇంకా డిజైన్ల ద‌శ‌లోనే ఉన్న‌ప్ప‌టికీ అమ‌రావ‌తికి హైప్ పెంచ‌డంలో బాబు స‌క్సెస్ అయ్యార‌నే దాంట్లో సందేహం లేదు. ఇదే రీతిలో అమరావతి నగరానికి మ‌రింత క్రేజ్ తెచ్చేందుకు బాబు ఇంకో నిర్ణ‌యం తీసుకున్నారు. అమ‌రావ‌తిని పాఠ్యాంశాల్లో భాగం చేయాల‌ని బాబు ప‌రోక్షంగా సూచ‌న‌లు చేశారు.

రాజధాని ప్రాంత అభివృద్ధిపై ఆయన సీఆర్‌ డిఏ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్ర‌జలందరిదీనని, గర్వకారణమైన ఈ నగరాభివృద్ధి భవిష్యత్తులో పాఠ్యాంశంగా రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం రాజధానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ ఏడాది విజయదశమికి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2019 మార్చి నాటికి అసెంబ్లీ - రాజభవన్ - హైకోర్టు - సచివాలయం - తదితర భవన నిర్మాణాలు పూర్తిచేసేలా లక్ష్యాలు నిర్ణయించుకున్నామన్నారు. రాజధాని నగర నిర్మాణ బాధ్యతలు చేపట్టే అరుదైన అవకాశం వందేళ్లలో ఒక్కసారి వస్తుందని, అలాంటి అవకాశం తనకు దక్కిందని చంద్రబాబు సంతోషం వ్యక్తపర్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో జపాన్ - సింగపూర్ ప్రభుత్వాలు భాగస్వాములయ్యేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. అమరావతి నగరం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి వివిధ అంశాలను డాక్యుమెంటరీ రూపంలో భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. అమరావతి నగరం పెట్టుబడులకే కాదని, సంతోషాలకూ కేంద్రంగా ఉండాలని ఆకాక్షించారు. ప్రవాసాంధ్రులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని, అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు నవ నగరాలను బ్రహ్మాండంగా నిర్మిద్దామని చంద్రబాబు పిలుపిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా నిలుస్తుందని చంద్ర‌బాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో దాని చరిత్రను తెలియచేస్తూ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిపారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.పోలవరంతో రైతుల సాగునీటి కష్టాలు తొలగిపోతాయని, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పేరును సార్థకం చేసుకుంటుందన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు ఆదేశించారు.

అయితే సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిపాద‌న‌పై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. అమ‌రావ‌తిని పాఠ్యాంశాల్లో చేర్చ‌డమ‌నే ప్ర‌తిపాద‌న‌ బాగానే ఉంది అందులో లాజిక్ కుద‌ర‌డం లేద‌ని చెప్తున్నారు. వంద‌లాది మంది రైతులు త‌మ భూములు కోల్పోయామ‌నే ఆవేద‌న‌, కోర్టుల‌కు ఎక్కిన తీరు, వేలాది మంది రైతు కూలీల‌కు తాము కోల్పోయిన ఉపాధి అవ‌కాశాల గురించి వెల్లువెత్తుతున్న అభ్యంత‌రాల‌ను ఈ పాఠ్యాంశాల్లో ఉంచుతారా అనే డౌట్ వ్య‌క్తీక‌రిస్తున్నారు. దీంతో పాటుగా తాత్కాలిక స‌చివాల‌యంలోని లీకుల ప‌ర్వం కూడా ఉంటుందా అని కొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.