Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కు క‌ల‌వ‌ర‌పెట్టే ఫిగ‌ర్స్ ఇవి!

By:  Tupaki Desk   |   25 May 2019 5:34 AM GMT
గులాబీ బాస్ కు క‌ల‌వ‌ర‌పెట్టే ఫిగ‌ర్స్ ఇవి!
X
ఆశ ఉండాలి. కానీ.. అత్యాశ అస్స‌లు ప‌నికి రాదు. విజ‌యం సాధించాక ఒద్దిక చాలా అవ‌స‌రం. అందుకు భిన్నంగా గ‌ర్వంతో విర్ర‌వీగితో మొద‌టికే మోసం వ‌స్తుంది. ఏపీ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే తెలంగాణ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం చాలా ఎక్కువ‌. చిన్న‌పాటి త‌ప్పుల‌ను వారు క్షమించ‌రు. ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు ఎంత‌లా నెత్తిన పెట్టుకుంటారో.. తేడా కొడితే అంత ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. తాజాగా వెలువ‌డిన తెలంగాణ ఎంపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించ‌క మాన‌దు.

నాలుగునెల‌ల క్రితం గులాబీ బాస్ ను నెత్తిన పెట్టుకున్న తెలంగాణ ప్ర‌జ‌లు తాజా ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న‌కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. వాస్త‌వానికి ఈ ఫ‌లితాల‌న్ని కూడా కేసీఆర్ చేసిన త‌ప్పుల‌కు మూల్యం చెల్లించేవే అన‌టంలో త‌ప్పు లేదు. త‌న‌కు తిరుగులేని అధికారాన్ని చేతికి ఇచ్చిన వేళ‌.. దాంతో సంతృప్తి చెంద‌టానికి భిన్నంగా విప‌క్ష‌మే లేకుండా చేయాల‌న్న కేసీఆర్ ప్ర‌య‌త్నం తెలంగాణ ప్ర‌జానీకానికి కోపం వ‌చ్చేలా చేసింది.

ప్ర‌శ్నించ‌టానికి ఒక్క‌డు కూడా మిగ‌ల‌కూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తీరుకు చెక్ పెట్టాల‌న్న భావ‌న తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. చేతికి ఇచ్చిన అధికారంతో తృప్తి ప‌డ‌కుంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌ను తెలంగాణ ఓట‌ర్లు స్ప‌ష్టంగా ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే తాజాగా వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల గ‌ణాంకాలు క‌నిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే తాజా ఎంపీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో స‌హా వివిధ పార్టీల‌కు వ‌చ్చిన ఓట్ల శాతంలో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు వ‌చ్చిన ఓట్ల శాతం త‌గ్గితే.. బీజేపీకి గ‌ణ‌నీయంగా పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ శాతంలోనూ స్వ‌ల్ప పెరుగుద‌ల క‌నిపించింది. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 62.69 శాతం ఓటింగ్ న‌మోదైతే.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్పంగా ఓటింగ్ త‌గ్గి 62.25 శాతం న‌మోదైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓటింగ్ త‌గ్గింది.

ఇక‌.. ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే.. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు మొత్తం ఓట్ల‌లో 46.87 శాతం ఓట్లు వ‌స్తే.. తాజా ఎన్నిక‌ల్లో అది కాస్తా 41.29 శాతానికి ప‌డిపోయింది. అంటే.. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర ఐదుశాతం కంటే ఎక్కువ ఓట్లను గులాబీ కారు కోల్పోయింది.

అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 28.43 శాతం ఓట్ల‌ను సాధించ‌గా.. తాజా ఎన్నిక‌ల్లో 29.48 శాతానికి పెంచుకోగ‌లిగింది. అన్నింటికంటే ఆస‌క్తిక‌ర‌మైన అంశం బీజేపీ ఓటు బ్యాంక్ భారీగా వృద్ది చెంద‌టం. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి కేవ‌లం 6.98 శాతం ఓట్లు మాత్ర‌మే రాగా.. తాజా ఎన్నిక‌ల్లో ఏకంగా 19.45 శాతం న‌మోదు కావ‌టం విశేషం. అంటే నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో బీజేపీ ఓటు బ్యాంకు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 13 శాతం వృద్ధి చెందింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గులాబీ బాస్ గుండెల్లో ద‌డ పుట్టించేదిగా చెప్ప‌క త‌ప్ప‌దు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లిత‌ల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు తిరుగులేద‌న్నట్లుగా ఉన్న టీఆర్ఎస్ కు.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు షాకింగ్ గా మారితే.. విప‌క్షాల‌కు కొత్త ఆశ‌లు చిగురించేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.