Begin typing your search above and press return to search.

మోడీ క‌ష్టాల‌న్నింటికి కార‌ణం లా మాండేనా?

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:20 AM GMT
మోడీ క‌ష్టాల‌న్నింటికి కార‌ణం లా మాండేనా?
X
ప్ర‌ధాని మోడీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశంగా దీన్ని చెప్పుకోవాలి. మోడీ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన నాటి నుంచి మీడియా విష‌యంలో ఆయ‌న అనుస‌రించే వైనం చాలా కొత్త‌గా ఉంద‌ని చెప్పాలి. అధికార‌ప‌క్షం మీడియాను త‌మ‌కు అనుకూలంగా ఉంచుకోవాల‌ని.. వ్య‌తిరేక వార్త‌లు రాయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేలా పావులు క‌ద‌ప‌టం మామూలే. అయితే.. ఈ విష‌యంలో మోడీ తీరు చాలా భిన్నం.

మైకు అందుకున్నంత‌నే వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిలా మాటలు చెప్పే ఆయ‌న‌.. మాట‌ల‌కు.. చేత‌ల‌కు అస్స‌లు సంబంధం లేని విధంగా ఉంటుంద‌న్న‌ది అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. త‌న‌ను.. త‌న ప్ర‌భుత్వాన్ని దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నించే మీడియా సంస్థ‌ల‌పై క‌నిపించ‌ని ఒత్తిళ్ల‌ను తీసుకురావ‌టం.. అవ‌స‌రానికి అనుగుణంగా మీడియా సంస్థ‌ల్లోని కీల‌క స్థానాల్లో ఉండే వారిని మార్చేసే విష‌యంలో మోడీ స‌ర్కారు ట్రాక్ రికార్డు ఘ‌నంగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మీడియాను త‌న క‌నుచూపుల్లో ఉండేలా.. వారి విష‌యంలో ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తూ.. నియంత్ర‌ణ అన్న‌ది క‌నిపించ‌ని రీతిలో ప్లాన్ చేసిన‌ట్లుగా చెప్పే మోడీ స‌ర్కారుకు.. ఇప్పుడు అదే మీడియా కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన రావ‌టం గ‌మ‌నార్హం. స్థానిక మీడియాలోనూ.. జాతీయ మీడియాలోనూ వీలైనంత వ‌ర‌కూ మోడీ స‌ర్కారుకు త‌గ్గ‌ట్లే.. ఆయ‌న‌కు ఇబ్బంది క‌లిగించ‌ని రీతిలో వార్త‌లు వ‌చ్చేవి. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా న‌డ‌వ‌టానికి ప్ర‌పంచ మీడియాను మోడీ శాసించ‌లేరుగా. ఆ మాట‌కు వ‌స్తే ట్రంప్ కే చేత‌కావ‌ట్లేదు.

రాఫెల్ డీల్ కు సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హోలాండ్ చేసిన వ్యాఖ్య‌ల్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేలా బీజేపీ వేసిన ఎత్తుగ‌డ రివ‌ర్స్ కొట్టింది. అదెలానంటే.. మాంట్రియ‌ల్ లో జ‌రిగినొక స‌ద‌స్సు కు హాజ‌రైన సంద‌ర్భంగా హోలాండ్ ను రిల‌య‌న్స్ డిఫెన్స్ పై ఒక న్యూస్ ఏజెన్సీ ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న ఫ్రెంచ్ లో మాట్లాడుతూ.. రిల‌య‌న్స్ డిఫెన్స్ ఎంపిక‌లో ప్ర‌భుత్వ పాత్ర ఏమీ లేద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఆ త‌ర్వాత మ‌రికొన్ని విష‌యాల్ని కూడా చెప్పారు. కానీ.. త‌న‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం మేర‌కు తీసుకున్న బీజేపీనేత‌లు.. రాఫెల్ డీల్ లో తాము శుద్ద‌పూస‌ల‌మ‌న్నట్లుగా ప్ర‌చారం చేసుకోవటం మొద‌లెట్టారు.

భార‌త మీడియాలోనూ ఆయ‌న వ్యాఖ్య‌లు స‌గ‌మే వ‌చ్చాయి. అయితే. హోలాండ్ వ్యాఖ్య‌ల్ని ఫ్రెంచ్ ప‌త్రిక "లా మాండే" మాత్రం య‌థాత‌థంగా ప్ర‌చురించింది. హోలాండ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ మీడియాలోనూ.. బీజేపీ నేత‌లు చెప్పే దానికి అద‌నంగా మ‌రో పేరా ఉంది. అందులో.. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత నిర్ణ‌యించిన కొత్త ఫార్ములా ప్ర‌కారం రిల‌య‌న్స్ డిఫెన్స్ గ్రూపు తెర మీద‌కు వ‌చ్చింద‌ని.. రిల‌య‌న్స్ ను మోడీ స‌ర్కారే త‌మ మీద రుద్దింద‌ని చెప్పారు.

అదే విష‌యాన్ని లా మాండే అచ్చేయ‌టంతో.. అది కాస్తా భార‌త్‌ కు చేరి.. మోడీ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎంత దాయాల‌న్నా కొన్ని దాగ‌వు. అందునా.. మీడియాను నియంత్రించ‌టం ద్వారా అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా చేయాల‌నుకోవ‌టం అంత తేలికైన సంగ‌తి కాద‌న్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.