Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను కంట్రోల్ చేయ‌టం బీజేపీకి కుద‌ర్లేదు

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:13 AM GMT
కాంగ్రెస్ ను కంట్రోల్ చేయ‌టం బీజేపీకి కుద‌ర్లేదు
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల పేర్ల‌తో పాటు.. వారి వృత్తి వివ‌రాలు చూస్తే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి క‌నిపిస్తుంది. చాలామంది కాంగ్రెస్ నేత‌ల్లో లాయర్లు క‌నిపిస్తారు. త‌మ ప‌దునైన వాద‌న‌ల‌తో న్యాయ‌స్థానాల్లో త‌మ వైరి వ‌ర్గానికి చుక్క‌లు చూపించే త‌త్త్వం ఎక్కువ‌గా ఉంటుంది. అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రి ప‌ద‌వులు.. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు అధికార‌ప‌క్షానికి ముంద‌ర కాళ్ల‌కు బంధాలు వేసేందుకు కోర్టులో కేసులు వేయ‌టం ద్వారా ఇబ్బంది పెడుతుంటారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు వీలుగా బీజేపీ నేత ఒక‌రు ఒక చిత్ర‌మైన పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. అదేమంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ‌రూ లాయ‌ర్లుగా ప్రాక్టీస్ చేయొద్ద‌ని. దీనిపై సుప్రీం ధ‌ర్మాస‌నం తాజాగా తీర్పును ఇచ్చింది.

న్యాయ‌వాదులైన ప్ర‌జాప్ర‌తినిధులు న్యాయ‌వాదిగా కొన‌సాగ‌కూడ‌ద‌న్న వాద‌న‌లో అర్థం లేద‌ని.. ప్ర‌జాప్ర‌తినిధులుగా వారు ఎన్నికైన‌ప్ప‌టికీ త‌మ న్యాయ‌వాద వృత్తిని కొన‌సాగించొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. న్యాయ‌వాదులైన ప్ర‌జాప్ర‌తినిధులు న్యాయ‌వాదిగా కొన‌సాగొద్ద‌ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నిబంధ‌న‌లు ఏమీ లేవ‌ని తేల్చి చెప్పింది. ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా ఎంపికైన నేత‌లు న్యాయ‌వాదులుగా ఏక‌కాలంలో ప‌ని చేయొద్దని.. వారి ప‌ద‌వీ కాలంలో ప్రాక్టీస్ లేకుండా చేయాలంటూ బీజేపీ నేత క‌మ్ అడ్వ‌కేట్ అయిన ఆశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. సుప్రీం తాజా తీర్పుతో కాంగ్రెస్ ను కంట్రోల్ చేసేందుకు బీజేపీ నేత చేసిన ప్ర‌య‌త్నం వృధా అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.