Begin typing your search above and press return to search.

తేజస్వి పుణ్యం :లాలూకోటలో తిరుగుబాటు!

By:  Tupaki Desk   |   28 July 2017 5:24 AM GMT
తేజస్వి పుణ్యం :లాలూకోటలో తిరుగుబాటు!
X
హద్దులు మీరిన పుత్రప్రేమ ఒక్కొక్కరిని ఎన్నెన్ని రకాలుగా కష్టాల పాలుజేస్తుందో తెలుసుకోవడానికి చరిత్రలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా లాలూ దృష్టాంతం కూడా అందులో ఒకటి. కన్నకొడుకుతో రాజీనామా చేయించడానికి ఆయన ససేమిరా అనడం, భీష్మించుకోవడం అనేది.. ఏకంగా ప్రభుత్వాన్నే కుప్పకూల్చేయడం మాత్రమే కాదు.. తన ప్రత్యర్థుల రాజకీయ బలాన్ని అమాంతం పెంచేసింది. పాపం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు ఈ ఎపిసోడ్ వలన ఏర్పడిన కష్టనష్టాలు అక్కడితో ముగియలేదు. ప్రజల్లో ప్రాభవం మారుతూ వస్తున్నప్పటికీ.. సొంత పార్టీ మీద లాలూ తిరుగులేని ఆధిపత్యం కలిగి ఉంటారు. అలాంటి లాలూ నిర్ణయాల మీద ఇప్పుడు పార్టీలోనే తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. కొడుకు కోసం పార్టీకి చేటు చేశారంటూ కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే గళమెత్తుతున్నారు.

‘జబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా.. తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా’ అనేది లాలూప్రసాద్ యాదవ్ నమ్మిన రాజనీతి. ఒకప్పట్లో ఆయన తన తిరుగులేని ప్రజాదరణ గురించి అందరితో అలా చెప్పుకుంటుండేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు గతించిపోయాయి. ఆయన తన పార్టీ రాజకీయాలకు సంబంధించి నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయిపోయారు. కొడుకును రంగంలోకి దించి.. ఈ ఎన్నికల్లో విజయం దక్కిన తర్వాత.. ఘనంగా నితీశ్ సరసన ఉప ముఖ్యమంత్రిని చేశారు.

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. అనువంశికంగా అయిన అలవాటు లాగా తేజస్వి యాదవ్ మీద కూడా పుంఖానుపుంఖాలుగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటి మీద ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఆయనకు నోటీసులు సర్వ్ అయ్యాయి. ఇంత దాకా వచ్చిన తర్వాత పదవినుంచి తప్పుకోవాల్సిందే అని నితీశ్ కోరినా.. లాలూ దాన్ని ఖాతరు చేయలేదు. పర్యవసానంగా ప్రభుత్వం కూలిపోయింది. కూటమి మారి.. అదే నితీశ్ సీఎంగా.. భాజపాకు చెందిన సుశీల్ మోడీ డిప్యూటీ సీఎం గా ప్రభుత్వం కొలువుతీరింది.

ఇన్నాళ్లూ అధికార కూటమి వారిగా దర్పం వెలగబెట్టిన ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా.. రాత్రికి రాత్రే విపక్షం వారైపోయారు. ఇది ఎలాంటి వారికైనా కడుపుమంట కలిగించే అంశమే. అందుకే కాబోలు.. మహేశ్వరయాదవ్ అనే ఓ ఎమ్మెల్యే.. తన తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తున్నారు. తేజస్వితో లాలూ రాజీనామా చేయించి ఉండాల్సిందని, అనవసరంగా ప్రభుత్వాన్ని కూల్చారని అంటున్నారు. ఒక్క మహేశ్వరయాదవ్ ఇవాళ బయటపడి ఉండొచ్చు. కానీ.. మిగిలిన వారి సంగతేమిటి? పార్టీలో ఈ రకంగా లాలూ పుత్రప్రేమ తమ పుట్టిముంచిందన్న ఆలోచనతో రగిలిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. కళ తగ్గిన లాలూ ఇప్పుడు ఈ అసంతృప్తులన్నిటినీ ఎలా చక్కదిద్దుకుని ముందుకుసాగుతారో చూడాలి.