Begin typing your search above and press return to search.

లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ ప్లానింగ్

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:02 AM GMT
లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ ప్లానింగ్
X
ఆశ్చర్యపోవద్దు... అవాక్కవ్వొద్దు కూడా. గంపెడుమందిని కన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఈ ఏజ్ లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడంలేదు. రాజకీయాల్లో పక్కా ప్లానింగ్ తో తన ప్యామిలీ అంతటికీ పదవులు ఇప్పించుకుంటున్నారు. దాన్నే బీహార్ లో ఇప్పుడు లాలూ ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంతటి శత్రుత్వం ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీతో మొన్నటి ఎన్నికల్లో జత కట్టి లాలూ బాగా లాభపడ్డారు. ఆ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించడం ఒక ఎత్తయితే ఇంటిల్లిపాదినీ గెలిపించుకోవడం ఇంకో ఎత్తు. కేసుల దెబ్బకు పోటీ చేసే అవకాశం లేకపోయింది కానీ లేకుంటే లాలూ కూడా గెలిచి మరింత రాజకీయం నడిపించేవారే. మొన్నటి ఎన్నికల్లో లాలూ తన ఇద్దరు కొడుకులను గెలిపించుకుని నితీశ్ కేబినెట్ లో మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. అందులో చిన్నోడు తేజస్వి యాదవ్‌ ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన విషయం తెలిసిందే.

అది చాలదన్నట్లుగా లాలూ తాజాగా తన సహధర్మచారిణి రబ్రీదేవికి కూడా మరో పదవిని కట్టబెట్టేశారు. బిహార్ శాసన మండలిలో రాష్ట్రీయ జనతాదళ్ పక్ష నేతగా ఆమె పేరును ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తేజస్వి యాదవ్‌ కే ఆర్జేడీ శాసన సభా పక్ష నేత పదవి ఇచ్చారు. గతంలోనూ లాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇంటిల్లిపాదీ పదవులతో పండుగ చేసుకున్నారు. ఇప్పుడు స్వయంగా అధికారంలో లేకున్నా నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తన ఫ్యామిలీ హవా నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీహార్ లో అతిపెద్ద పార్టీగా కూడా అవతరించడంతో తాను కోరిందంతా చేయాల్సిందేనని పట్టుపడుతున్నారని తెలుస్తోంది.