లాలూను కెలికి మరీ తిట్టించుకున్నాడు

Mon Mar 20 2017 19:01:35 GMT+0530 (IST)

కొంతమంది నేతల తీరే వేరుగా ఉంటుంది. కదిలించుకొని మరీ తిట్టించుకుంటారు. తాజాగా అలాంటి పనే చేశారు బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు.. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీకి ఎప్పుడూ ఏదో ఒక మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. తాజాగా.. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. లాలూ ప్రసాద్ యాదవ్ పై వ్యంగ్యస్త్రాల్ని సంధించారు సుశీల్ కుమార్ మోడీ.

‘‘యోగి ముఖ్యమంత్రి కావటంతో ఆయన్ను ఎలా తిట్టాలో కూడా తెలీని పరిస్థితులో లాలూ ఉన్నారు’’ అంటూ లాలూకు చురకేస్తూ ట్వీట్ చేసి ఆనందపడిపోయారు సుశీల్ కుమార్ మోడీ. దీనికి ధీటుగా స్పందించిన లాలూ..అంతే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్ను పిలవలేదని మరీ బాధపడిపోకు.. నువ్వు కూడా చెవులు కుట్టించుకో.. గుండు కొట్టించుకో.. దుస్తులు మార్చుకో.. అది నీకు మేలు చేయొచ్చంటూ అదిరిపోయేలా రియాక్ట్ అయ్యారు.

సుశీల్ కుమార్ పై లాలూ రియాక్ట్ అయిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజానికి వీరిద్దరి మధ్య కొద్దీ రోజులుగా ట్వీట్ ల యుద్ధం నడుస్తోంది. యూపీ ఎన్నికల్లో సంచలన  విజయం నేపథ్యంలో లాలూను కెలికిన సుశీల్.. లాలూ మీ పరిస్థితి ఏమిటి? అంటూ ఓ చిన్న ట్వీట్ విసిరారు. దీనికి స్పందించిన లాలూ.. నేను బాగానే ఉన్నా.. నిన్ను యూపీలో అడుగుపెట్టనివ్వకపోటంతోనే అక్కడ మీ పార్టీ గెలిచిందంటూ చురకేశారు.అప్పటి నుంచి ఏదో ఒక అంశంపై ట్వీట్లతో ఒకరినొకరు పంచ్ లు వేసుకుంటున్నారు. అయితే.. ఎక్కువసార్లు  లాలూనే ట్వీట్ పంచ్ లలో పైచేయి సాధిస్తుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/