Begin typing your search above and press return to search.

బాబుపై ల‌క్ష్మీపార్వ‌తి శ‌ప‌థం విన్నారా?

By:  Tupaki Desk   |   18 Jan 2018 6:59 AM GMT
బాబుపై ల‌క్ష్మీపార్వ‌తి శ‌ప‌థం విన్నారా?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి - ప్ర‌స్తుతం వైసీపీ నేత‌గా ఉన్న ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న స‌తీమ‌ణి హోదాలో ల‌క్ష్మీపార్వ‌తి... చంద్ర‌బాబుతో పాటు ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌ను టార్గెట్ గా చేసిన తాజా వ్యాఖ్య‌లు నిజంగానే టీడీపీ నేత‌ల‌కు మంట పుట్టించేలానే ఉన్నాయి. గ‌తంలోనూ టీడీపీ నేత‌ల‌పై ప్ర‌త్యేకించి చంద్రబాబుపై ల‌క్ష్మీపార్వ‌తి చాలా కామెంట్లే చేశారు. అయితే ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆమె తాజాగా చేసిన వ్యాఖ్య‌లు మాత్రం ప్రాధాన్యం సంతరించుకున్నాయ‌నే చెప్పాలి. గ‌తంలో బాల‌య్య‌పై పెద్ద‌గా మాట్లాడ‌ని ల‌క్ష్మీపార్వ‌తి తాజాగా మాత్రం ఆయ‌న‌తో పాటు చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని సంధించిన మాట‌ల తూటాలు ఇప్పుడు వైర‌ల్‌ గానే మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా ల‌క్ష్మీపార్వ‌తి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌తంలో మాదిరే ఈ ద‌ఫా కూడా చంద్రబాబును ఫుల్ గా టార్గెట్ చేసిన ల‌క్ష్మీపార్వ‌తి.. చంద్రబాబును గ‌ద్దె దించే దాకా తాను విశ్ర‌మించ‌బోన‌ని ప్ర‌క‌టించారు. నేటి ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌ కు నివాలి అర్పించిన సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా చంద్ర‌బాబుపై ల‌క్ష్మీపార్వ‌తి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్టీఆర్‌ కు భారతరత్న రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అందుకే ఇప్పటివరకు ఎన్టీఆర్ కు భారతరత్న రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేందుకే ఏపీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు చంద్రబాబు పేరు పెడుతున్నారని ఆరోపించారు. నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పరితపించేవార‌ని - ప్రజల కోసం ఎన్టీఆర్ మళ్లీ పుడతారన్నారని ఆమె చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్టీఆర్‌ ను గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఎన్టీఆర్‌ ను గౌరవిస్తారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తీస్తే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలన్నారు. ఎన్టీఆర్‌ కు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా?అని కూడా ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆశయాలు నిలబెట్టే అసలైన వారసురాలిని తానేనని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబుని గద్దె దించిన తర్వాతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు.

ఇక బాల‌య్య ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి... ప్రపంచ తెలుగు మహభసభల్లో ఎన్టీఆర్ పేరును స్మరించుకోకపోవడం భాదాకరమన్నారు. ఎన్టీఆర్‌ ను విస్మరించిన ప్రపంచ తెలుగు మహసభలకు బాలకృష్ణ ఎందుకు హజరయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ పేరును ప్రపంచ తెలుగు మహసభల్లో స్మరించుకోకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొత్తంగా అల్లుడు చంద్ర‌బాబుతో పాటు ఎన్టీఆర్ కుమారుడి ఇటీవ‌లే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన బాల‌య్య‌ను కూడా ల‌క్ష్మీపార్వ‌తి త‌న‌దైన శైలిలో తూర్పార‌బ‌ట్టార‌నే చెప్పాలి.