Begin typing your search above and press return to search.

వర్మకు నా పర్మిషన్ చాలు: లక్ష్మీ పార్వతి

By:  Tupaki Desk   |   23 Sep 2017 9:31 AM GMT
వర్మకు నా పర్మిషన్ చాలు: లక్ష్మీ పార్వతి
X
సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా పెను వివాదాన్ని రేపుతోంది. అయితే... ఈ సినిమా తీయడానికి ఎవరి అనుమతులు అవసరం లేదని, కేవలం తన అనుమతి మాత్రం చాలని ఆయన భార్య లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఎన్టీఆర్ కుమారుల అనుమతి దీనికోసం అవసరం లేదని ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను పదవీచ్యుతున్ని చేసి చంద్రబాబు సీఎం అయిన సమయంలో గవర్నరుగా ఉన్న కృష్ణకాంత్, అప్పటి న్యాయమూర్తి ప్రభాశంకర్ మిశ్రా, వైస్రాయ్ హోటల్ యజమాని ప్రభాకర్ లకు చంద్రబాబు ఎలాంటి మేళ్లు చేశారన్నది కూడా చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో ఎంత వేదన అనుభవించారు, ఎలాంటి అవమానాలకు గురయ్యారన్నది వర్మ చెప్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. అంతేకాదు... చంద్రబాబు చేసిన తప్పులను అంగీకరించి క్షమాపణలు కోరి, తనపై వేసిన నిందలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తే ఆయన్ను క్షమిస్తానని.. ఆయన గురించి ఇంకెపప్పుడూ మాట్లాడబోనని చెప్పారు.

ఎన్టీఆర్, తన గురించి ఎవరికీ మాట్లాడే అర్హత లేదని.. ఇది కొనసాగితే తాను కోర్టుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీడియాలపైనా ఆమె మండిపడ్డారు. వర్మ వాస్తవాలు తీయాలని... దాన్ని తాను స్వాగతిస్తానని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ కు, తనకు జరిగిన పెళ్లికి చంద్రబాబు కూడా సాక్షి అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. తానేమీ, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించలేదని... అప్పటి అధికారులకు కూడా ఈ విషయం తెలుసని ఆమె అన్నారు. అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ ను అడిగితే అన్ని విషయాలూ తెలుస్తాయన్నారామె. తానెన్నడూ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, కానీ, తనపై నిందలేసి దోషిగా నిలెబెట్టారని ఆరోపించారు. వర్మ తన సినిమాలో ఇలాంటి వాస్తవాలన్నీ చూపించాలని కోరారు. వర్మ తనతో ఇంతవరకు దీనిపై మాట్లాడలేదని, కానీ... ఆయన అసలేం జరిగిందో చెప్తారని ఆశిస్తున్నారన్నారు.