Begin typing your search above and press return to search.

బాబు కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డిన రోజులు ఎన్నోః ల‌క్ష్మీపార్వ‌తి

By:  Tupaki Desk   |   23 Oct 2017 8:27 AM GMT
బాబు కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డిన రోజులు ఎన్నోః ల‌క్ష్మీపార్వ‌తి
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు - దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీలో త‌న కేంద్రంగా సాగిన కుట్ర‌లు - అందులో ప్ర‌స్తుత టీడీపీ ర‌థ‌సార‌థి నారా చంద్ర‌బాబు నాయుడు పోషించిన పాత్ర గురించి ఆమె వివ‌రించారు. ఓ మీడియా ఛాన‌ల్‌ తో మాట్లాడుతూ ...``అనుకోని పరిస్థితుల్లో మొదటి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. మా అమ్మానాన్నలు కూడా ఆ పెళ్లిని తిరస్కరించారు. మాకు ఒక కొడుకు పుట్టిన తర్వాత...నా భర్త - నేను దూరమయ్యాం. విభేదాల కారణంగా మేము విడిపోయాం. ఆ తర్వాత ఎన్టీఆర్ తో వివాహం జ‌రిగింది`` అని వివరించారు. దివంగ‌త ఎన్టీఆర్ త‌న‌కు ఇచ్చిన ప్రాధాన్యం, తెలుగుదేశం పార్టీలో త‌న‌కు ద‌క్కుతున్న గౌర‌వం చూసి ప‌క్క‌కు త‌ప్పించాల‌ని భావించిన చంద్ర‌బాబు అనేక కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు.

ఈ క్ర‌మంలో ఇటు ఎన్టీఆర్ ఇమేజ్ అటు తెలుగుదేశం పార్టీ ప్ర‌భ‌ను కించ‌ప‌ర్చేలా ప్ర‌చారం జ‌రిగింద‌ని దీని వెనుక ఎవ‌రున్నారో మొద‌ట్లో అర్థం కాలేద‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. ``నేను ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల టీడీపీ ఓడిపోతుంద‌ని...ఎన్టీఆర్‌ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మొద‌లైంద‌ని...ముఖ్యంగా మ‌హిళ‌లు మండిపడుతున్నార‌ని..ఇలా అనేక ప్ర‌చారాలు జ‌రిగేవి. ఎందుకు ఇలా జ‌రుగుతోంద‌ని ఆలోచించ‌గా మాకు తెలిసింది ఈ ప్ర‌చారం వెనుక ఉంది చిన్న‌ల్లుడు నారా చంద్ర‌బాబు నాయుడు అని. ఈ విష‌యం స్వ‌యంగా నాతో ఎన్టీఆర్‌ గారు చెప్పారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర `తెలుగు తేజం`లో కూడా చంద్రబాబునాయుడి కుట్ర ఎలా మొదలైందనే విషయం నేను రాశాను. ఎన్టీఆర్ జీవితంలోకి నేను ప్రవేశించక ముందు నుంచే ఆయన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నాడు`` అంటూ ల‌క్ష్మీపార్వ‌తి ఆనాటి సంఘ‌ట‌ల‌ను గుర్తుకు చేసుకున్నారు.

``పొద్దున్న లేస్తే పేప‌ర్ చూడాలంటే భ‌యం వేసే అన్ని కుట్ర‌లు మాపై జ‌రిగేవి. ఎన్టీఆర్ గారు...ప‌త్రికలు చూడ‌వ‌ద్ద‌నేవారు..ప‌త్రిక‌లు చ‌దివితే...నాకేమో పేప‌ర్ చ‌ద‌వ‌నిదే పొద్దు పోయేది కాదు. అలా తెల్లారి లేస్తుంటే భ‌యం వేసే ప‌రిస్థితులు క‌ల్పించారు `` అంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. త‌న‌పై జ‌రిగిన కుట్ర వెను ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే లేడ‌ని..మ‌రో ప‌త్రికాధినేత కూడా ఉన్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. త‌న చెప్పుచేత‌ల్లో ఉండే వ్య‌క్తి సీఎంగా లేడ‌నే భావ‌న‌తో 1995 నుంచే స‌ద‌రు మీడియా మొఘ‌ల్ త‌మ‌పై కుట్ర చేస్తున్నాడ‌ని..దీనికి చంద్ర‌బాబు తోడ‌య్యాడ‌ని ల‌క్ష్మీపార్వ‌తి వివ‌రించారు.