Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు సీఎం ప‌ద‌వి..కొత్త ప్ర‌తిపాద‌న‌

By:  Tupaki Desk   |   13 Jun 2018 3:12 PM GMT
బాల‌య్య‌కు సీఎం ప‌ద‌వి..కొత్త ప్ర‌తిపాద‌న‌
X
ఈవీఎంల ప‌నితీరుపై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌నకే బూమరాంగ్ అవుతున్నాయి. టెక్నాల‌జీపై విశేష ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించే చంద్ర‌బాబు ఈవీఎంల గురించి భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేయ‌డం చిత్రంగా ప‌లువురు భావించిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై వైసీపీ నేత‌లు కొత్త విశ్లేష‌ణ చేశారు. వైసీపీ నాయ‌కురాలు - దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ కు వస్తోన్న ప్రజా స్పందనను జీర్ణించుకోలేని సీఎం ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడుతున్నాడని ఆమె మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని..‌ తాను ఓడిపోతానని అనుకున్నప్పుడల్లా ఈవీఎంల ట్యాంపరింగ్ పై చర్చ లేపుతున్నాడని ఆమె ఆరోపించారు.

2014లో ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారా అని ల‌క్ష్మీపార్వ‌తి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలిస్తేనేమో నిజాయితీ - వేరే వాళ్లు గెలిస్తే మాత్రం సక్రమం అవుతుందా అని నిలదీశారు. 2014 చంద్రబాబు ట్యాంపరింగ్‌ చేశారా అని ఆమె ప్రశ్నించారు. ఈవీఎంలను దొంగతనం చేసిన వారికి చంద్రబాబు ఐటీ సలహాదారుడి పోస్ట్ ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా చెప్పినా.. మళ్లీ చంద్రబాబు అదే విషయాన్ని మాట్లాడుతన్నారని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయాలో తెలిసిన దొంగలు చంద్రబాబు నాయుడు పక్కన వున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ట్యాంపరింగ్ చేస్తాడనే భయం తమకు ఉందని..దీనిపై ఎన్నికల సంఘానికి తామే ఫిర్యాదు చేస్తామని లక్ష్మీపార్వతి వివరించారు. సొంత సర్వేల్లోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో చంద్రబాబు ఇలాంటి అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నాలుగేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం చేసి రూ. 4 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని జాతీయ సర్వేలే చెబుతున్నాయని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు నేర చరిత్ర కలిగి ఉన్నారని జాతీయ మీడియా, సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. సొంత సర్వేల్లోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఇటీవల మోత్కుపల్లి, పోసాని కృష్ణమురళీ కూడా చంద్రబాబును విమర్శించారని, జెండా నీది కానప్పుడు ఎందుకు మోసం చేస్తావని పేర్కొంటున్నారని తెలిపారు. ఎన్‌టీఆర్‌ అభిమానులు బాలకృష్ణ సీఎం కావాలని కోరుతున్నారని, ఇకనైనా టీడీపీని ఎన్‌టీఆర్‌ కుమారుడికి ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ముఖంలో భయం స్పష్టంగా కనబడుతుందని, ఇకనైనా చంద్రబాబు తప్పుకోవాలని సూచించారు టీటీడీలో ఆగమన శాస్త్ర్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే దాన్ని సరిచేయకుండా రాజకీయం చేసిన చంద్రబాబు ఇవాళ టీటీడీ ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీకి నోటీసులు ఇప్పించడం దారుణమన్నారు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సీబీఐ విచారణ చేయించుకొని నిజాయితీ నిరూపించుకోవాలని కానీ, తప్పించుకోవడం, స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైందని ఎద్దేవా చేశారు.