ఫ్లాట్ ఫాం మనుషులు నాపై సినిమానా-లక్ష్మీపార్వతి

Wed Nov 15 2017 00:10:12 GMT+0530 (IST)

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విషయంలో మొదట్నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్ష్మీపార్వతి మరోసారి ఫైర్ అయింది. పేర్లు ఎత్తకుండా ఈ సినిమా తీస్తున్న వారిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైల్వే ఫ్లాట్ ఫాం మీద పడుకునేవాళ్లు.. నిండా అప్పులతో మునిగిపోయిన వాళ్లు నా మీద సినిమా తీస్తారా అని ఆమె ప్రశ్నించింది. ఈ సినిమా తీయాలనుకుంటున్న వాళ్ల అర్హతలేంటి అని ఆమె ప్రశ్నించారు.‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా తీయడంలో వీరి వెనుక కొన్ని అదృశ్య శక్తులు పని చేస్తున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సినిమా తీసే పేరుతో వీళ్లందరూ కలిసి డ్రామాలు నడిపిస్తున్నారని.. దీని వెనుక అసలు గుట్టేంటో.. వీళ్లను నడిపిస్తున్నది ఎవరో త్వరలోనే బయటపెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాను 25 ఏళ్ల కిందటే విడాకులు తీసుకున్న వ్యక్తితో ఇప్పుడు ముడిపెట్టి సినిమా తీయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా చూస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఐతే లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శక నిర్మాత కేతిరెడ్డి కూడా దీటుగానే స్పందించాడు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక అంశాలతో సినిమా తీసే హక్కు తనకుందని.. వద్దనడానికి లక్ష్మీపార్వతి ఎవరని అతను ప్రశ్నించాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని.. జనవరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పూర్తి చేస్తానని అతనన్నాడు.