Begin typing your search above and press return to search.

బాబును ఎందుకు క‌లిశానో చెప్తున్న‌ ల‌గ‌డ‌పాటి

By:  Tupaki Desk   |   13 Sep 2017 7:28 AM GMT
బాబును ఎందుకు క‌లిశానో చెప్తున్న‌ ల‌గ‌డ‌పాటి
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళవారం సచివాలయంలో భేటీ అవ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబుతో లగడపాటి సమావేశం వెనుక సైకిల్ ఎక్క‌డ‌మే కార‌ణం అయి ఉంటుందా అని ప‌లువురు చ‌ర్చించుకున్నారు. అయితే ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని తేల్చేశారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుతో భేటీపై ఓ టీవీ చాన‌ల్‌ తో మాట్లాడిన ల‌గ‌డ‌పాటి మ‌రిన్ని వివరాలు తెలిపారు. బాబును స‌చివాల‌యంలో క‌లిశానంటేనే త‌న భేటీకి రాజ‌కీయ ప్రాధాన్యం ఏమీ లేద‌ని అర్థం చేసుకోవాల‌ని ల‌గ‌డ‌పాటి అన్నారు. పార్టీలో చేరాల‌నుకుంటే చంద్ర‌బాబు ఇంట్లోనే స‌మావేశం అయి ఉండేవాడిన‌ని వ్యాఖ్యానించారు. వ్యాపార‌వేత్త‌గా ఉన్న త‌ను ఇష్టం కాబ‌ట్టే రాజకీయాల్లోకి వచ్చానని అయితే....అనివార్య కారణాల వల్ల తప్పుకున్నానని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని ల‌గ‌డ‌పాటి తేల్చిచెప్పారు.

అలాగే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల అనంతరం తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు. అయితే స‌ర్వేలు చేయ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని రాజ‌కీయాలు-స‌ర్వేలు వేర్వేరని స్ప‌ష్టం చేశారు. తెలుగు రాష్ర్టాల మ‌ధ్య గ‌తంలో విబేధాలు ఉండేవ‌ని ఇప్పుడు అవ‌న్నీ స‌మ‌సిపోయాయ‌ని తెలిపారు. గతంలోనూ లగడపా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే.