శపధాలు మనకు కలిసి రావు లగడపాటి!

Mon May 20 2019 20:00:01 GMT+0530 (IST)

కొందరికి కొన్ని అస్సలు అచ్చిరావు. ఆంధ్రా ఆక్టోపస్ గా అభివర్ణించే లగడపాటి రాజగోపాల్ కు శపధాలు ఆయనకు ఏ మాత్రం కలిసి రావు. రాష్ట్రస్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో సత్ సంబంధాలు ఉన్నాయని చెప్పే లగడపాటి రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదన్న ఆయన మాటల్ని నమ్మిన ఆంధ్రోళ్లకు చేతికి చిప్ప మిగిలింది. లగడపాటి లాంటి తోపులు ఏపీ సమైక్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తారని.. వారికున్న పలుకుబడితో విభజన కాకుండా ఉంచగలుగుతారని నమ్మినోళ్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.రాష్ట్ర విభజన కానీ జరిగితే తన రాజకీయ సన్యాసం తప్పదన్న మాట విన్నోళ్లంతా.. ఒక రాజనీయ నాయకుడు తన పొలిటికల్ కెరీర్ ను పణంగా పెడతానని శపధం చేశాక..అలా జరిగే అవకాశం ఉందన్న నమ్మకంతో ఉండిపోయారు. అయినా..కొద్దిమంది నాయకుల మీద ఆంధ్రోళ్లు పెట్టుకున్న నమ్మకం ఎంత ఖరీదైన తప్పుగా మారుతుందన్న విషయాన్ని ఆంధ్రోళ్ల చాలా ఆలస్యంగా గ్రహించారని చెబుతారు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విభజన జరిగితే రాజకీయ సన్యాసమేనన్న లగడపాటి తన మాటను నిలబెట్టుకోవటమే కాదు.. రాజకీయాలకు దూరంగా ఉండటం షురూ చేశారు. కాకుంటే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావటం చేస్తుంటారు. తాజాగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్  నేపథ్యంలో ఆయన మరోసారి శపధం చేశారు. తాను చెప్పినట్లుగా జరగకపోతే.. మరెప్పటికీ సర్వేలు చేయనన్న భారీ మాటను చెప్పేశారు.

ఇంత పెద్ద మాట లగడపాటి నోటి నుంచి వచ్చిన తర్వాత బాబు గెలుపు పక్కా అని భావించినోళ్లంతా.. విభజన నాటి అయ్యగారి శపధం గురించి గుర్తు తెచ్చుకుంటే మంచిందంటున్నారు. ఇప్పటివరకూ గెలుపు ధీమాతో ఉన్నోళ్లు.. లగడపాటి మాటలతో మరింత పెరిగిన వేళ.. ఈవీఎంలు తెరిచిన తర్వాత అందుకు భిన్నమైన ఫలితం వస్తే తట్టుకోవటం కష్టం. అందుకు.. రానున్న మూడు రోజుల్లో మెంటల్ గా ప్రిపేర్ కావటం మంచిదంటున్నారు. అచ్చిరాని శపధాలతో లగడపాటి సర్వేలు చేయించుకునే అవకాశాన్ని తనకు తానుగా వదులుకుంటే.. ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు ఈసారి ఆయనే మాధ్యమాన్ని ఉపయోగించుకుంటారన్న ప్లాన్ ఏమైనా చేసుకున్నారా?