లగడపాటి చెప్పిన 'పోతారు సార్' ఎవరిని ఉద్దేశించి?

Wed Dec 05 2018 15:36:58 GMT+0530 (IST)

తెలంగాణలో లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆయన బయటపెట్టిన సర్వే ఫలితాల పై అంతా చర్చించుకుంటున్నారు. ప్రజా కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని లగడపాటి చెప్పగా.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ తనతో లగడపాటి వాట్సప్ చాట్‌ను బహిర్గతం చేశారు. చంద్రబాబు ఒత్తిడితో ఆయన సర్వే ఫలితాలు తారుమారు చేశారని చెప్పారు. దీంతో బుధవారం మరోసారి మీడియా ముందుకొచ్చిన లగడపాటి తనపై ఎవరి ఒత్తడి లేదన్నారు. సర్వేకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపెట్టారు.ఈ సందర్భంగా గులాబీ దళపలి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం గురించి లగడపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గత అక్టోబర్ 28న తాను గజ్వేల్ వెళ్లినట్లు లగడపాటి తెలిపారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు అక్కడ తన కారు ఆపారని చెప్పారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదన్నారు. కానీ - ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. అనంతరం అక్కడున్న పోలీసులు తనతో సెల్ఫీలు దిగారని చెప్పారు.

ఆపై గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను ఆరా తీశానని లగడపాటి చెప్పారు. దీంతో ఏడుగురు కానిస్టేబుళ్లు స్పందిస్తూ.. ‘పోతారు సార్’ అని బదులిచ్చారన్నారు. అయితే ఈ మాట ఎవరిని ఉద్దేశించి వారు చెప్పారో ఇప్పుడు బయటపెట్టడం తనకు ఇష్టం లేదని తాజా ప్రెస్ మీట్‌లో లగడపాటి అన్నారు. ఈ నెల 7న పోలింగ్ పూర్తయ్యాక ఆ మాట ఎవరిని ఉద్దేశించిందో చెప్తానన్నారు.

అయితే - లగడపాటి చెప్పిన పోతారు సార్ అనే మాట ఎవరి గురించి అయ్యుంటుందని ఇప్పుడు రాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ఓటమిని సూచిస్తూ అలా కానిస్టేబుళ్లు చెప్పారని కొందరు చెప్తుండగా.. కేసీఆర్‌కు ఎదురొస్తే ఎంతటివారైనా పోతారు సార్ అని వారు చెప్పి ఉండొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఈ నెల 7వ తేదీ సాయంత్రం లగడపాటి ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగాల్సిందే!