Begin typing your search above and press return to search.

ఎవరీ బబితా థాడే..ఇప్పుడెందుకు ఆమె హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:55 AM GMT
ఎవరీ బబితా థాడే..ఇప్పుడెందుకు ఆమె హాట్ టాపిక్
X
ఆమె నెల జీతం అక్షరాల పదిహేను వందల రూపాయిల మాత్రమే. చేసేది ఒక స్కూల్లో వంట మనిషి. మరి.. అలాంటోళ్లు దేశంలో వేలాది మంది ఉంటారు. అలాంటిది ఆమె ఎందుకు ఫేమస్ అయ్యారు. ఇప్పుడామెను అంతా తెగ అభినందిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిదాతగా అభివర్ణిస్తున్నారు. నిన్నటి వరకూ ఆమె చేసిన కిచిడీని ఇష్టంగా తినే పిల్లలు.. స్కూల్ విద్యార్థులు.. ఇప్పుడు ఆమె నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవటానికి సిద్ధపడుతున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకంత పాపులర్ అయ్యారన్న విషయంలోకి వెళితే.. బిగ్ బి అమితాబ్ నిర్వహిస్తున్న మెగా క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయిలు సాధించిన తాజా విజేత బబితా థాడే. మహారాష్ట్రకు చెందిన స్కూల్లో వంట మనిషిగా చేసే ఆమె తాజాగా జరిగిన పోటీలో ఆమె ఏకంగా కోటి రూపాయిల్ని సొంతం చేసుకొని వార్తల్లోకి వచ్చారు. నిత్యం బతుకుపోరులో పోరాడే ఆమె.. బిగ్ బి ముందు కూర్చొని కష్టమైన.. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తీరు ఇప్పుడు వార్తాంశంగా మారింది.

కిచిడీ స్పెషలిస్ట్ గా పేరున్న ఆమె నిత్యం 450 మంది పిల్లలకు కిచిడీ తయారు చేసి పెడుతుంటారు. అలాంటి ఆమె హాట్ సీట్లోకూర్చొని బిగ్ బి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చివరకు కోటి రూపాయిల ప్రశ్నకు సమాధానం చెప్పటం.. అది కరెక్ట్ కావటంతో ఇప్పుడామె నయా సంచలనంగా మారారు.

ప్రస్తుతానికి ఆమె ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలేదు. అయితే.. ఆమె ప్రోగ్రామ్ కు చెందిన ప్రోమో విడుదల కావటంతో ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోటి రూపాయిలు గెలుచుకున్న విజేతగా.. ఆ డబ్బును ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే.

చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది ప్రశ్న కాదని.. చేసే పనిలో సంతృప్తి ఉండాలన్నఆమె.. తనకొచ్చే కోటితో ముందు ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నట్లుచెప్పారు. తనకు ఇప్పటివరకూ ఫోన్ లేదని.. మంచి సెల్ కొనాలనుకుంటున్న తన చిన్న కోరికను వెల్లడించారు.