Begin typing your search above and press return to search.

గురువుకి ఈసారీ మోడీ హ్యాండ్ ఇస్తున్నట్లేనా?

By:  Tupaki Desk   |   27 Feb 2017 4:40 AM GMT
గురువుకి ఈసారీ మోడీ హ్యాండ్ ఇస్తున్నట్లేనా?
X
దేశ ప్రధాని మోడీ గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పేస్తుంటారు. అదేమీ తప్పు కాదు. ఆయన మాటల్నియథాతధంగా విని.. ఫీలైన వారంతా అలానే వ్యవహరిస్తుంటారు. అదే మోడీ మాటల మాయాజాలం. మోడీ మాటలకు.. చేతలకు మధ్య దూరం చాలానే ఉంటుంది. మాటల్లో వల్లించే ఆదర్శాలు చేతల్లో కనిపించవు. పది మంది ముందు చాలా గౌరవంగా.. మర్యాదగా వ్యవహరించే వారి విషయంలో మోడీ ఎంత కరకుగా.. కఠినంగా వ్యవహరిస్తారనటానికి బీజేపీ భీష్ముడిగా కొందరు అభివర్ణించే అద్వానీ ఉదంతమే అసలుసిసలు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఈ రోజు మోడీ ఈ స్థానంలో కనిపిస్తున్నారంటే.. పార్టీలో ఆయనకు అవకాశాల్ని కల్పించి.. ఆయన్ను ప్రమోట్ చేసిన అద్వానీ ప్రయత్నాల్నిమర్చిపోలేం. వాజ్ పేయ్ లాంటి వారు మోడీ మీద గుర్రుగా ఉన్న వేళ.. అండగా నిలబడినోళ్లలో అద్వానీ ముందుంటారు. మోడీకి అసలుసిసలు రాజకీయ గురువుగా అభివర్ణించే అద్వానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శిష్యుడు ప్రధాని కుర్చీలో కూర్చొని ఉన్న వేళ.. గురువుకు కీలక స్థానం లభించే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా వయసు పేరుతో ఏ పదవి అప్పగించకుండా చేసిన మోడీని తక్కువ చేసిన చూడటం అంటే.. మనల్ని మనం మోసగించుకోవటమే అవుతుంది. తన జీవితంలో ప్రధానమంత్రి పదవిలో కూర్చోవాలన్నది అద్వానీ కల. అది తీరదని తేలిపోయింది. ప్రధాని పదవిలో కాకున్నా.. దేశ ప్రధమ పౌరుడి హోదాను కట్టబెట్టేందుకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కానీ.. మోడీ అందుకు సిద్ధంగా లేరన్న వాదన వినిపిస్తోంది.

మరికొద్ది నెలల్లో రాష్ట్రపతి పదవి నుంచి ప్రణబ్ ముఖర్జీ వైదొలగనున్నారు. ఆయన పదవీ కాలం జులై నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రాష్ట్రపతి కుర్చీలో ఎవరు కూర్చుంటారన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు అప్పుడప్పుడు వినిపించినా.. తాజాగా నాలుగు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అందులోఒకరు సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి కాగా.. రెండో పేరు విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ గా చెప్పొచ్చు. ఇక.. మూడో పేరు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. నాలుగో పేరు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ములు.

రాష్ట్రపతి పదవికి వినిపిస్తున్న నాలుగు పేర్లలో మూడు పేర్లుమహిళలే కావటం ఒక విశేషమైతే.. మోడీ గురువు అద్వానీ పేరు మాత్రం వినిపించకపోవటం మర్చిపోకూడదు. ఇప్పటి వరకూ అందుతున్న సమచారం ప్రకారం.. అద్వానీ పేరు రాష్ట్రపతి రేసులోకి అస్సలు రాలేదని.. ఆ దిశగా మోడీ అండ్ కో ఆలోచించటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇది చాలు.. మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థంకావటానికి. రాజకీయంగా తనను పెంచి పోషించిన గురువుకు పంగనామాలు పెట్టటంలో మోడీ తర్వాతే ఎవరైనా అన్న విమర్శ వినిపిస్తోంది. రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎంపికచేయని పక్షంలో.. మోడీకి అదో మచ్చలా మిగిలిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. మోడీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/