Begin typing your search above and press return to search.

ఎల్ ఐసీకి కంపెనీలు ఎంత ఎగ్గొట్టాయో తెలుసా?

By:  Tupaki Desk   |   28 April 2016 4:15 AM GMT
ఎల్ ఐసీకి కంపెనీలు ఎంత ఎగ్గొట్టాయో తెలుసా?
X
లక్ష రూపాయిలు అప్పు కావాలని బ్యాంకుల వద్దకు వెళితే ఎన్ని తిప్పలు పెడతారో.. మరెన్ని పత్రాలు అడుగుతారో ప్రతిఒక్కరికి అనుభవమే. ఇక.. ఎల్ ఐసీలో ఇచ్చే రుణాలకు సంబంధించిన ప్రొసీజర్ ఫాలో కావటానికి చాలానే ఓపిక కావాలి. ఎల్ ఐసీ దగ్గర లోన్ అప్లై చేసి.. దాని దగ్గర నుంచి డబ్బులు వచ్చేందుకు భారీ ప్రొసీజర్ ఉంటుంది. అయితే.. ఇదంతా సాదాసీదా జనాల దగ్గర మాత్ర​​మేనని.. కొన్ని కంపెనీల పట్ల ఎల్ ఐసీ ప్రదర్శించే ప్రత్యేక ప్రేమను చూస్తే షాక్ తినాల్సిందే.

ఎందుకంటే.. కొన్ని కంపెనీలలో ఎల్ ఐసీ పెట్టిన పెట్టుబడుల కారణంగా నష్టపోయిన మొత్తం అక్షరాల రూ.65,700 కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని ఎల్ ఐసీ ఎలా నష్టపోయిందన్న విషయాన్ని చూస్తే ఆశ్చర్యంతో నోట మాట రాదంతే. మరో విస్మయకర విషయం ఏమిటంటే.. మిగిలిన బ్యాంకుల మాదిరి ఎల్ ఐసీ కంపెనీలకు నేరుగా అప్పు ఇవ్వదు. అయినప్పటికీ ఇంత భారీ అప్పు ఎందుకున్నదన్న విషయాన్ని చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.మార్కెట్ పెట్టుబడుల కారణంగా వివిధ కంపెనీల షేర్లలోనూ.. డిబెంచర్లలోనూ.. ఇతర రుణ పత్రాల్లోనూ ఎల్ ఐసీ పెట్టుబడులు పెడుతుంది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత తాను పెట్టుబడులను తిరిగి తీసుకునే సమయానికి సదరు కంపెనీలు చెల్లించలేకపోతే అడ్డంగా బుక్ అయ్యేది ఎల్ ఐసీనే.

ఏ కంపెనీకి సంబంధించిన షేర్లు.. డిబెంచర్లు కొనుగోలు చేయాలన్న అంశంపై ఉన్న అవకాశాన్ని అసరా చేసుకొని అధికారులు ఇష్టారాజ్యంగా చేసిన కొనుగోళ్లు పుణ్యమా అని ఈ సంస్థ ఏకంగా రూ.65,700 కోట్లు కోల్పోయిందని చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాల ఎగవేతకు సంబంధించిన ఉదంతంలో మిగిలిన అన్ని బ్యాంకుల కంటే కూడా పెద్ద బాధితురాలు ఎవరంటే ఎల్ ఐసీనేనని చెప్పక తప్పదు.

జీవితబీమాలో అగ్రస్థానంలో ఉన్న ఎల్ ఐసీ దగ్గర నిధులు కుప్పలు.. తెప్పలుగా ఉంటాయి. వీటిని పద్ధతి ప్రకారం బయటకు మళ్లించిన వైనం చూస్తే దీని వెనుక భారీ కుట్ర జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇంత భారీ ప్రజాధనం ఎలా బయటకు వెళ్లింది. అంతా చట్టబద్ధంగా జరిగినట్లు కనిపించే ఈ ఉదంతంలో ఎల్ ఐసీ ఇష్టారాజ్యంగా పెట్టుబడులు పెట్టేలా నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? వారి వెనుక ఎవరున్నారు? ఎల్ ఐసీ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఏమిటి? ఏ కంపెనీకి ఎంత మొత్తంలో ఎల్ ఐసీ పెట్టుబడులు పెట్టింది? లాంటి వివరాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది.