Begin typing your search above and press return to search.

కిర‌ణ్ పై అప్ప‌ట్లోనే వేటు వేయాల్సింద‌ట‌!!

By:  Tupaki Desk   |   13 Aug 2017 4:23 AM GMT
కిర‌ణ్ పై అప్ప‌ట్లోనే వేటు వేయాల్సింద‌ట‌!!
X
చేత‌కానిత‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు చ‌రిత్ర ముచ్చ‌ట్లు చెప్పుకొని కాలం గ‌డిపే అల‌వాటు కొంద‌రిలో ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల్ని చూడ‌మ‌ని అధినాయ‌క‌త్వం సూచించిన కుంతియా కూడా ఇప్పుడు అదే బాట‌లో న‌డ‌వ‌టం కాస్తంత విశేషంగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. అప్పుడెప్పుడో రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు జ‌రిగిపోయిన ముచ్చ‌ట్ల‌ను ప్ర‌స్తావిస్తూ.. అరెరే.. అలా జ‌రిగింది. అప్ప‌ట్లో అలా జ‌ర‌గ‌కుంటే ఇప్పుడు మ‌రోలా ఉందంటూ చెప్పే క‌బుర్ల‌ను చూస్తే.. ఇప్పుడున్న దుస్థితి నుంచి త‌ప్పించుకునే య‌త్నంగా అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు.

చేత‌కాన‌ప్పుడు.. చేయ‌లేన‌ప్పుడు చెప్పే మాట‌ల్ని.. బాధ్య‌త‌ల్ని స్వీక‌రించిన తొలినాళ్ల‌లోనే కుంతియా నోటి వెంట రావ‌టం కాస్త ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి. మొన్నామ‌ధ్య దాకా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల్ని చూసే డిగ్గీ రాజాపై వేటు వేసి.. అధినాయ‌క‌త్వంతో క్లోజ్ గా ఉండే కుంతియాకు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం తెలిసిందే. పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో తాజాగా హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు కుంతియా.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి వెంట వ‌చ్చిన మాట‌లు వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఎందుకంటే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌టానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. అందులో ముఖ్య‌మైంది.. తెలంగాణ రాష్ట్రం ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా ఆంధ్రాప్రాంతానికి చెందిన కిర‌ణ్ కుమార్ రెడ్డిని సీఎంగా కొన‌సాగించ‌టంగా చెప్పారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. కిర‌ణ్ లాంటి ఆంధ్రా నేత‌ల వ‌ల్లే తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావించిన‌ట్లుగా కుంతియా చెప్ప‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ అంశంపై సీడ‌బ్ల్యూసీ నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే కిర‌ణ్ ను ప‌ద‌వి నుంచి త‌ప్పించిన‌ట్లైతే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని.. గెలుపు ప‌క్కా అంటూ ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేస్తున్న కుంతియా మాట‌లు చూస్తే.. అప‌రిప‌క్వ‌త‌తో ఆయ‌న మాట‌లు ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే.. కిర‌ణ్ ను సీఎం కుర్చీలో నుంచి దింపే క‌న్నా.. పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తాన‌ని మాట ఇచ్చిన కేసీఆర్ ను త‌క్కువ చేసి చూడ‌టం.. ఆయ‌న చేసిన ప్ర‌తిపాద‌న‌ను పెడ చెవిన పెట్ట‌టం లాంటివ‌ని చెప్పాలి. అలాంటి చారిత్ర‌క స‌త్యాల్ని దాచేసి..నోటికి వ‌చ్చిన‌ట్లుగా కుంతియా లాంటి వారు మాట్లాడే మాట‌లు వారి మీద ఉన్న గౌర‌వాన్ని తగ్గించ‌టంతో పాటు.. రాష్ట్ర రాజ‌కీయాలపై ఆయ‌న‌కున్న అవ‌గాహ‌న రాహిత్యం ఇట్టే తెలుస్తుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. నిజానికి నిందించాల్సింది కుంతియాను కాదు.. ఆయ‌న్ను ఎంపిక‌చేసిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.