కుంభమేళా ఆదాయం...1.2 లక్షల కోట్లు

Sun Jan 20 2019 21:53:25 GMT+0530 (IST)

భారతీయ ఆధ్యాత్మికతు మహోన్నతంగా చాటిచెప్పే కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం విశిష్టతను గుర్తించిన వారిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభమేళా మరో ప్రత్యేకతను నమోదు చేసుకుంది. జనవరి 15న ప్రారంభమైన ఈ మెగా మేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. ఇది నిజానికి మతపరమైన ఓ భారీ వేడుక అయినా దీనితో ముడిపడి ఉన్న ఆర్థిక కార్యకలాపాలు వివిధ రంగాల్లోని ఆరు లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. అంతేకాకుండా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ కు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు  వెల్లడించింది.సీఐఐ అధ్యయనం ప్రకారం ఆతిథ్య రంగం 2 లక్షల 50 వేల మందికి ఎయిర్ లైన్స్ ఎయిర్ పోర్ట్స్ లక్షా 50 వేల మందికి టూర్ ఆపరేటర్స్ 45 వేల మందికి ఎకో టూరిజం మెడికల్ టూరిజంలో 85 వేల మందికి ఈ కుంభమేళా ఉపాధి కల్పించనుంది. ఇది కాకుండా అసంఘటిత రంగంలో టూర్ గైడ్స్ ట్యాక్సీ డ్రైవర్స్ వలంటీర్లు ఇంటర్ ప్రీటర్స్ రూపంలో మరో 55 వేల ఉద్యోగాలు వచ్చినట్లు సీఐఐ చెప్పింది. ఇవన్నీ ప్రభుత్వ ఏజెన్సీలు వ్యాపారుల ఆదాయాన్ని భారీ పెంచినట్లు తెలిపింది. అంతేకాదు ఈ కుంభమేళాకు ఆస్ట్రేలియా యూకే కెనడా మలేషియా సింగపూర్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ మారిషస్ జింబాబ్వే శ్రీలంకల నుంచి భారీ ఎత్తున విదేశీయులు కూడా వచ్చారు. ఈ భారీ ఆదాయం ద్వారా ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాకుండా రాజస్థాన్ ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలు కూడా లబ్ధి పొందనున్నట్లు సీఐఐ చెప్పింది. కాగా 50 రోజుల కుంభమేళా నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.4200 కోట్లు కేటాయించింది. 2013లో జరిగిన మహా కుంభమేళా కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులను ఈసారి ఇవ్వడం విశేషం.