నాన్న కోసమే బీజేపీ ఆఫర్ ను కాదన్నా!

Wed May 16 2018 17:06:08 GMT+0530 (IST)

జేడీఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో రావటం.. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించటం.. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 8 సీట్ల దూరంలో ఆగిపోవటంతో ఇప్పుడా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇండిపెండెంట్లు ఏమైనా సాయం చేస్తారనుకుంటే.. ఇద్దరిలో ఒకరు బీఎస్పీ ఎమ్మెల్యే కావటం.. మరొకరు కాంగ్రెస్ అనుకూల నేత కావటంతో.. ఇతరుల ఖాతాలో ఉన్న రెండు సీట్ల మీద కూడా బీజేపీ ఆశలు పెట్టుకోలేని పరిస్థితి.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 8 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీకి ముందుకు వెళ్లేందుకు ఉన్న దారులన్ని ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. జేడీఎస్ నుంచి చీలక తీసుకొస్తారన్న వార్తలు రాగా.. చీలికకు కీలకమని చెప్పిన రేవణ్ణ.. తాజాగా తన సోదరుడు కుమారస్వామితో కలిసి మీడియా ముందుకు వచ్చి తన మీద వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలుగా తేల్చేశారు.

దీంతో జేడీఎస్‌లో చీలిక ఏర్పడుతుందన్న మాటలోనూ నిజం లేదని తేలిపోయింది.ఇలాంటివేళ.. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్.. బీజేపీ రెండు పార్టీల నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆఫర్లు వచ్చినట్లుగా ప్రకటించారు.

అయితే.. తాను బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. 2004-2005లో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కారణంగా తన తండ్రి దేవెగౌడకు మచ్చ తెచ్చానని.. ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఈసారి సద్వినియోగం చేసుకొని గతంలో పడిన మచ్చను చెరిపివేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

అందుకే కాంగ్రెస్ తో నడవాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను తీసుకున్నది సరైన నిర్ణయమన్నారు. తాను బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అమిత్ షా మిమ్మల్ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు కుమారస్వామి సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కాంగ్రెస్.. బీజేపీ శ్రేయోభిలాషులు తనను సంప్రదించారన్నారు. మొత్తంగా తన తండ్రి కోసమే తాను కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్దమయ్యాన్న కుమారస్వామి మాటలు చూస్తే.. నాన్న కోసం బీజేపీకి నో అంటే నో చెప్పినట్లుగా స్పష్టమవుతుందని చెప్పకతప్పదు.