Begin typing your search above and press return to search.

కుమార‌స్వామి బ‌ల‌ప‌రీక్ష‌కు ముహుర్తం ఫిక్స్!

By:  Tupaki Desk   |   15 July 2019 10:02 AM GMT
కుమార‌స్వామి బ‌ల‌ప‌రీక్ష‌కు ముహుర్తం ఫిక్స్!
X
గ‌డిచిన వారంగా ప‌లు మ‌లుపులు తిరిగిన క‌ర్ణాట‌క‌రాజ‌కీయం ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అధికార పక్షానికి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌టంతో కుమార‌స్వామి ప్ర‌భుత్వం సంక్షోభాన్నిఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన కేసు మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు ముందు విచార‌ణ‌కు రానుంది.

ఇదిలా ఉంటే.. త‌న బ‌ల‌ప‌రీక్ష‌కు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సిద్ధం కావ‌టంతో తాజాగా స్పీక‌ర్ ఈ నెల 18 (గురువారం) ఉద‌యం 11 గంట‌ల‌కు విధాన స‌భ‌లో విశ్వాస ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ క‌మ‌లంలో భాగంగా జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లేలా క‌మ‌ల‌నాథులు ప్ర‌య‌త్నించ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలుచోటుచేసుకోవ‌టం తెలిసిందే.

ఒక‌ద‌శ‌లో త‌న ప‌ద‌వికి రాజీనామా ప్ర‌క‌టించిన కుమార‌స్వామి.. త‌ర్వాత మన‌సు మార్చుకొని త‌న ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌నుఎదుర్కొంటుంద‌న్నారు. దీంతో.. ఈ రోజు (సోమ‌వారం) బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌నుకున్నారు. అయితే.. మంగ‌ళ‌వారం కోర్టులో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై నిర్ణ‌యం వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో.. కోర్టు తీర్పు అనంత‌రం బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించేందుకు వీలుగా గురువారాన్ని నిర్ణ‌యించారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 16 మంది రాజీనామా చేశారు. వీరి రాజీనామాల్నివెంట‌నే ఆమోదించాల‌ని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన ప‌క్షంలో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 208కి త‌గ్గిపోతుంది. అప్పుడు మేజిక్ ఫిగ‌ర్ 105 గా మారుతుంది. ఇదిలా ఉంటే.. ఇద్ద‌రుఇండిపెండెంట్ స‌భ్యుల‌తో క‌లిపి బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉండగా.. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 101గా ఉండ‌నుంది. వీరిలోఅసెంబ్లీ స్పీక‌ర్ ను క‌లుకొంటేనేఈ మాత్ర‌మైనా. అంటే.. ప్ర‌భుత్వం నిల‌వటానికి ఐదుగురు ఎమ్మెల్యేల (స్పీక‌ర్ ను కాద‌నుకుంటే) అవ‌స‌రం ఉంది.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత‌మంది ఎమ్మెల్యేల్ని అధికార‌ప‌క్షంలోకి తీసుకురావ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నిగా క‌నిపించ‌ట్లేదు. చూస్తుంటే..అనూహ్య ప‌రిణామాలు ఏమీ చోటు చేసుకోకుంటే కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి గురువారం నూక‌లు చెల్లే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి.