కులభూషన్ జాదవ్ కేసు..అంతర్జాతీయ న్యాయస్థానం ఏం తేల్చనుంది?

Tue Feb 19 2019 09:40:21 GMT+0530 (IST)

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ మిలటరీ కోర్టులో మరణశిక్ష పడిన  భారతీయుడు కులభూషన్ జాదవ్ విడుదలకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్‌లో ఈ రోజు తుది వాదనలు మొదలయ్యాయి. అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై నాలుగు రోజుల పాటు వాదనలు విననుంది. తుది వాదనల్లో తొలిరోజున భారత్ తన గొంతును సమర్థంగా వినిపించింది. భారత్ తరఫున అక్కడ వాదనలు వినిపించిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే పాక్ తీరును ప్రపంచం ముందు ఎండగట్టారు. అసలు జాదవ్ పై మోపిన అభియోగాలు ఏమిటన్నది కూడా అధికారికంగా చెప్పడానికి పాక్ భయపడుతోందని ఆయన అన్నారు.
   
తన స్వప్రయోజనాల కోసం పాక్ అంతర్జాతీయ కోర్టును దుర్వినియోగం చేస్తోందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడం - తప్పుడు కేసు బనాయించడంపై భారత్ ప్రధానంగా వాదనలు వినిపించింది.‘‘అమాయకుడైన ఓ భారతీయుడి ప్రాణాలను ప్రమాదంలో నెడుతున్న ఈ కేసు అత్యంత దురదృష్టకరం...’’ అని హరీశ్ సాల్వే విన్నవించారు.
   
పాకిస్తాన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలనీ... న్యాయ సహాయానికి సైతం అనుమతించకుండా కస్టడీ కొనసాగించడాన్ని చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు.  జాదవ్ వద్దకు దౌత్యాధికారులను అనుమతించాలంటూ భారత్ 13 సార్లు విజ్ఞప్తి చేసిందనీ... అయినప్పటికీ ఇస్లామాబాద్ అంగీకరించలేదనన్నారు.
   
కాగా జాదవ్ ను అసలు పాక్ లో పట్టుకోలేదని.. ఆయన్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని భారత్ ఆరోపిస్తోంది. వ్యాపార పనులపై ఇరాన్ వెళ్లిన జాదవ్ ను పాకిస్తాన్ కిడ్నాప్ చేసిందన్నది భారత్ ఆరోపణ. అయితే.. పాక్ మాత్రం 2016 మార్చి 3న ఇరాన్ నుంచి బలూచిస్తాన్ ప్రవేశించిన జాదవ్ ను తమ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్టు చెబుతోంది.