Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌..మీ అన్న లాగే పార్టీ అమ్మేస్తావా?

By:  Tupaki Desk   |   24 April 2017 1:20 PM GMT
ప‌వ‌న్‌..మీ అన్న లాగే పార్టీ అమ్మేస్తావా?
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రాజ‌కీయ ఎదురుదాడి తీవ్ర‌మైంది. ఇన్నాళ్లు ఏపీ బీజేపీ నేత‌లు ప‌వ‌న్ తీరును త‌ప్పుప‌ట్ట‌గా తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణలోని క‌మ‌ళ‌నాథులు సైతం చేరారు. ఇటీవ‌ల ద‌క్షిణాది-ఉత్త‌రాది అంటూ వివ‌క్ష అంటూ ప‌వ‌న్ పలు పోస్టులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్ కు రాజ‌కీయ స్ప‌ష్ట‌త లేద‌ని ఎద్దేవా చేశారు.

హైద‌రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో కృష్ణ‌సాగ‌ర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ వివ‌క్ష‌త పేరుతో ప‌వ‌న్ చేసే ట్వీట్లో ఆయ‌న అప‌రిప‌క్వ‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని మండిప‌డ్డారు. జాతీయ సమ‌గ్ర‌త అనేది బీజేపీ ప్రాథ‌మిక సిద్ధాంత‌మ‌ని పేర్కొంటూ ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు గుర్తుంచుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆధారాలుంటేనే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని, ఇలాంటి కామెంట్లు రాజకీయ నిరుద్యోగానికి నిదర్శనాలని కృష్ణ‌సాగ‌ర్ రావు ఎద్దేవా చేశారు. `ప‌వ‌న్ మీ అన్న‌.. పార్టీ ఏర్పాటు చేసిన మీ అన్న చిరంజీవి దాన్ని స‌రైన ధ‌ర‌కు అమ్మేసి లాభం పొందాడు. జ‌న‌సేన కూడా అదే ప‌రిస్థితిలో ఉందా? మీ పార్టీ ప‌య‌నంపై మీకు క్లారిటీ ఉందా?` అంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌రాభ‌వం పొందిన అనంత‌రం ఆ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఎంపీ ప‌ద‌వి పొంది కేంద్రమంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/