Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పై జ‌ర్న‌లిస్ట్ నేత‌ల ఫైర్‌!

By:  Tupaki Desk   |   26 April 2018 6:57 AM GMT
ప‌వ‌న్ పై జ‌ర్న‌లిస్ట్ నేత‌ల ఫైర్‌!
X
క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు మీడియా వ‌ర్సెస్ ప‌వ‌న్ అన్న‌ట్లుగా మార‌టం తెలిసిందే. మీడియా అంటే మొత్తం మీడియా కాదు కానీ కొన్ని మీడియా సంస్థ‌లకు ప‌వ‌న్ కు ముఖాముఖి అన్న‌ట్లుగా త‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితి.

ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకొని ప‌వ‌న్ ఫైర్ అవుతుంటే.. ఆయా మీడియా సంస్థ‌లు త‌మ మాధ్య‌మాన్ని.. పోలీసుల‌తో ఫిర్యాదుల ద్వారా వ‌వ‌న్ పై ఎదురుదాడి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీడియా సంస్థ‌ల ప‌క్షాన కొంద‌రు జ‌ర్న‌లిస్టు నేత‌లు తీవ్ర‌స్థాయిలో జ‌న‌సేనాధినేత‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఆంధ్ర‌జ్యోతి.. టీవీ9 సంస్థ‌ల‌పై ట్వీట్ల‌తో ప‌వ‌న్ ఫైర్ కావ‌టంపై టీయూడ‌బ్ల్యూజే నేత క్రాంతికిర‌ణ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ చేస్తున్న ట్వీట్లు ఎలాంటి మైండ్ సెట్ లో చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. తాగి ఆ సందేశాలు పెడుతున్నారో లేక ఎలా పెడుతున్నారో అర్థం కావ‌టం లేద‌న్న ఆయ‌న‌.. మీడియాను త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్నార‌ని.. మీడియాను బ్లాక్ మొయిల్ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

మీడియా సంస్థ‌ల‌కు ప‌వ‌న్ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.

ప‌వ‌న్ కార‌ణంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌న్న క్రాంతి.. హైద‌రాబాద్ నుంచి ఆయ‌న్ను పంపేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని తాను కోరుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఒక జ‌ర్న‌లిస్టు సంఘ నాయ‌కులు ఇంత తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేన‌ట్లుగా ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుండటం గ‌మ‌నార్హం. ఆధునిక సింగ‌పూర్ నిర్మాత లీ కున్ యూ ఫోటోను ట్వీట్ చేసిన ప‌వ‌న్‌.. సింగ‌పూర్ నిర్మాణం ఎలా జ‌రిగిందో తెలుసుకోవ‌టానికి లీ జీవిత క‌థ చ‌ద‌వాల‌న్నారు. ఈ ట్వీట్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని పెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. లీ బ‌యోగ్ర‌ఫీకి సంబంధించిన పుస్త‌క ముఖ‌చిత్రంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు.

మ‌రికొన్ని సూక్తుల్ని పోస్టు చేసిన ప‌వ‌న్‌.. విష బీజాల నుంచి అమృత ఫ‌లాలు పుట్ట‌వ‌ని..విరోధం నుంచి స్నేహం పుట్ట‌ద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

త‌న డైరీలోని మ‌రో పోస్ట్‌ను షేర్ చేసిన‌ట్లు చెప్పిన ప‌వ‌న్‌.. అణిచివేత‌తో ఆరంభ‌మైన అధికారం నిల‌వ‌ద‌ని.. త‌మ లెక్క‌ల ప్ర‌కారం విరోధం రాజుల మ‌ధ్య ఉండేదే కానీ వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య లేద‌ని.. తామంతా భార‌తీయుల‌మ‌ని అనుకుంటున్నార‌ని ఖార‌వేలుడు న‌వ‌ల నుంచి తాను రాసుకున్న వ్యాఖ్య‌ల్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. త‌న‌ను ప్ర‌భావితం చేసిన ఇన్ ప‌ర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పుస్త‌కం లోని కొన్ని పేరాల్ని ఆయ‌న పోస్టు చేశారు.