పట్టపగలు అత్యాచారయత్నం...వైరల్ వీడియో!

Mon Oct 23 2017 16:07:07 GMT+0530 (IST)

ఈ దుర్యోధన...దుశ్శాసన....దుర్వినీత లోకంలో ....రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో....మరో మహా భారతం....ఆరవ వేదం...మానభంగ పర్వంలో...మాతృ హృదయ నిర్వేదం.....నవ భారతంలోని దుశ్శాసనులనుద్దేశించి మూడు దశాబ్దాల క్రితం  ప్రతి ఘటన సినిమా కోసం ఈ పాటను రచించారు. 32 సంవత్సరాల తర్వాత కూడా భరతుడు పాలించిన దేశంలో అబలలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ధైర్యంగా నడవగలిగిన నాడే నా భారతావనికి నిజమైన స్వాతంత్ర్యం అని జాతిపిత చెప్పిన మాటలను కలియుగ దుశ్శాసనుల చెవులకు వినిపించడంలేదు. అర్ధరాత్రే కాదు....కనీసం పట్టపగలు కూడా మహిళలు ఒంటరిగా బయట తిరగలేని పరిస్థితులు ప్రస్తుతం నవ భారతావనిలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.... దేశంలో ఏదో ఒక మూల మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలో ఓ యువతి పై పట్టపగలే ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కేరళలోని కోజికోడ్ లో ఓ వీధిలో పట్టపగలే  ఈ దారుణ ఘటన జరగడం కలవర చెందాల్సిన విషయం. ఈ నెల 18న ఓ యువతి తన సొంత ఊరు నుంచి కోజికోడ్ కు వచ్చింది. అక్కడ వైఎంసీఏ రోడ్డులో నడుచుకుంటూ తన హాస్టల్‌కు వెళ్తోంది. అప్పటికే గోతికాడ నక్కలాగా కాచుకున్న దుండగుడు ఆమెపై కన్ను వేశాడు. ఆ దుండగుడు ఆమెను అనుసరిస్తూ వీధి చివర వరకూ వెళ్లాడు. జన సంచారం లేదని నిర్ధారించుకున్నా తర్వాత ఆమెను పొదల్లోకి లాక్కెళ్లాలని యత్నించాడు. అయితే అనూహ్యంగా ఆ యువతి గట్టిగా అరుస్తూ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో ఆధారంగా జంషీర్ ను గుర్తించిన నడక్కవ్ పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.