Begin typing your search above and press return to search.

బాబు రాజ్యంలో ఫ్లెక్సీ చించేస్తే హత్యాయత్నం కేసు

By:  Tupaki Desk   |   22 Oct 2016 1:59 PM GMT
బాబు రాజ్యంలో ఫ్లెక్సీ చించేస్తే హత్యాయత్నం కేసు
X
ఒక ఫ్లెక్సీని చించేస్తే పోలీసులు ఎలాంటి కేసు పెడతారు? ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా.. మహా అయితే చిన్న కేసు పెట్టేస్తారు. కానీ.. ఏపీలోని బాబు సర్కారులో పోలీసుల అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని నిరూపించే ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఈ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర మీదకు తీసుకొచ్చిన గోదావరి మెగా అక్వాఫుడ్ పార్క్ ఎపిసోడ్ లోనూ.. దాన్ని వ్యతిరేకించిన వారిపై తీవ్రమైన కేసులు పెట్టటం.. మహిళలపై బైండోవర్ కేసులు పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.

అడా.. మగా అన్న తేడా లేకుండా అక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న వైనంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయటాన్ని కోర్టు సైతం తప్పు పట్టిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం (సరిగ్గా చెప్పాలంటే ఈ నెల 19న) మాజీ ఎమ్మెల్యే.. జగన్ పార్టీకి చెందిన నేత కొట్టు సత్యనారాయణ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని ప్రదర్శించుకున్నారు. అయితే.. స్థానిక మంత్రి పైడికొండల మాణిక్యాలరావు.. ఆయన అనుచరుతు ఈ ఫ్లెక్సీలు తీయించటం.. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా ఈ వివాదానికి బాధ్యుడంటూ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యానారాయణపై పోలీసులు సెక్షన్ 307.. అదేనండి హత్యాయత్నం కేసును నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీనిపై కొట్టు తరఫు లాయరు.. ఫ్లెక్సీ వివాదాన్ని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చి.. జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. కొట్టు తరఫు లాయర్లు చెప్పిన వివరాల్ని విన్న కోర్టు.. తాడేపల్లి గూడెం పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టి.. ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసు పెడతారా? అంటూ ప్రశ్నించి.. కాసిన్ని అక్షింతలు వేసింది. అదే సమయంలో కొట్టుకు బెయిల్ మంజూరు చేసింది. చిన్న చిన్న ఉదంతాల విషయంలో పెద్ద పెద్ద కేసులు పెడుతున్న తీరు పలువురు తప్పు పట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/