Begin typing your search above and press return to search.

గ్రాండ్ గా కోట్ల ఎంట్రీ?

By:  Tupaki Desk   |   21 Feb 2019 5:31 AM GMT
గ్రాండ్ గా కోట్ల ఎంట్రీ?
X
ఒక్కొక్క‌రికి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించటం అంటే భారీ జూదం ఆడుతున్న‌ట్లే లెక్క‌. ఇదే కోవ‌లోకి వ‌స్తుంది క‌ర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వ్య‌వ‌హారం. కోట్ల అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రులుగా చేసిన నేత‌ల్లో కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి ఒక‌రు. ఆ పార్టీకి వీర విధేయులుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పార్టీ టికెట్ ఇవ్వ‌ని వేళ‌లో జిల్లా పార్టీ కార్యాల‌యాన్ని త‌గ‌ల‌బెట్టేసి మ‌రీ టికెట్ తెచ్చుకున్న ఘ‌న చ‌రిత్ర కోట్ల కుటుంబానికి ఉంది.

అలాంటి కోట్ల కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేర‌టమంటే కాల మ‌హిహ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. కోట్ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌ర్నూలు జిల్లాలో టీడీపీ అధిక్య‌త అంతంత‌మాత్ర‌మే. టీడీపీకి సంబంధించి పేరున్న‌నాయ‌కులు ఎంత‌మంది ఉన్నా.. వారికి ధీటైన కాంగ్రెస్ నేత‌ల‌కు కొర‌త ఉండేది కాదు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన త‌ర్వాత వైఎస్ విధేయుల్లో ఎక్కువ‌మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నాటి నుంచి టీడీపీ ఎంత ప్ర‌య‌త్నించినా వైఎస్సార్ కాంగ్రెస్ అధిక్య‌త నిలువ‌రించ‌లేని ప‌రిస్థితి. 2014 సార్వ‌త్రిక ఎన్నికల్లోనూ ఇదే ప‌రిస్థితి. దీంతో.. క‌ర్నూలులో ప‌ట్టు పెంచుకోవ‌టానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల్ని టార్గెట్ చేసి మ‌రీ.. ఒత్తిడితోనూ.. కేసుల బూచితోనూ అధికార‌ప‌క్షంలోకి చేరేలా బాబు ప్లాన్ చేసిన‌ట్లుగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తుంటారు.

ఇదిలా ఉంటే..త‌న ప‌ద‌వీ కాలంలో ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను పెద్ద ఎత్తున మూట‌క‌ట్టుకున్న చంద్ర‌బాబు పుణ్య‌మా అని ఏపీలో వ్య‌తిరేక గాలులువీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌టానికి వీలుగా.. బ‌ల‌మైన నాయ‌కుల్ని పార్టీలోకి తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. విభ‌జ‌న కార‌ణంగా కాంగ్రెస్ మీద ఎప్ప‌టికి తీర‌ని కోపాన్ని పెంచుకున్న ఏపీ ప్ర‌జ‌ల కార‌ణంగా కోట్ల పార్టీ మార‌టం అనివార్య‌మైంది. కోట్ల లాంటి బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం త‌మ పార్టీలోకి చేరితే.. క‌ర్నూలు జిల్లాలో మ‌రింత ప‌ట్టు బిగించొచ్చ‌న్న భావ‌న‌లో బాబు ఉన్నారు.

ద‌శ‌ల వారీగా సాగిన చ‌ర్చ‌ల అనంత‌రం కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రెఢీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ నెల 28న పార్టీలో చేరేందుకు మ‌హుర్తం పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కోడూమురులోని ఆర్ అండ్ బీ అతిథి గృహం స‌మీపంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని.. ఇందుకు ల‌క్ష‌కు త‌గ్గ‌కుండా కార్య‌క‌ర్త‌ల్ని స‌మీక‌రించాల‌న్న ఆలోచ‌న‌లో కోట్ల ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న ఎంట్రీ గ్రాండ్ గా ఉండ‌టంతో పాటు.. క‌ర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి తానో అండ‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేయాల‌న్న ఆలోచ‌న‌లో కోట్ల ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత కేఈ కృష్ణ‌మూర్తికి కోట్ల‌కు మ‌ధ్య‌న ఉన్న రాజ‌కీయ వైరాన్ని బాబు ఎలా బ్యాలెన్స్ చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కోట్ల‌తో క‌ర్నూలు జిల్లాలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్న ప్లానింగ్ బాగానే ఉన్నా.. అదే మాత్రం బెడిసి కొట్టినా మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న బాబుకు.. కోట్ల ఎంట్రీ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో కాల‌మే డిసైడ్ చేయాలి.