Begin typing your search above and press return to search.

ఫ్యాన్ గాలికి ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి

By:  Tupaki Desk   |   24 May 2019 8:04 AM GMT
ఫ్యాన్ గాలికి ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి
X
రాయ‌ల‌సీమలో రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించే కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒక‌టి. ఇప్ప‌టికి ఆ కుటుంబానికి క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉంది. మొద‌ట్నించి కాంగ్రెస్ లో ఉన్న ఆ కుటుంబం తాజా ఎన్నిక‌ల వేళ‌.. టీడీపీలో చేర‌టం తెలిసిందే. టీడీపీలో చేరి టికెట్లు సాధించిన వారు దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని మూట‌గట్టుకున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. కోట్ల ఫ్యామిలీనే కాదు.. టీడీపీలోని ప‌లు రాజ‌కీయ కుటుంబాల‌కు తాజా ఎన్నిక‌లు ఒక పీడ‌క‌ల‌గా మారాయ‌ని చెప్పాలి.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కేఈ కృష్ణ‌మూర్తితో ఉన్న వైరాన్ని వ‌దిలేసి మ‌రీ పార్టీ మారిన దానికి కోట్ల కుటుంబాన్ని క‌ర్నూలు జిల్లా ప్ర‌జ‌లు రిజెక్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. కోట్ల ఫ్యామిలీ నుంచి ఒక‌టి కాదు రెండు టికెట్లు తీసుకొని బ‌రిలోకి దిగి మ‌రీ ఓట‌మిపాలు కావ‌టం విశేషం.

పార్టీలోకి కోట్ల ఎంట్రీ ఇచ్చిన నేప‌థ్యంలో కోట్ల కోరిన‌ట్లే వారికి చంద్ర‌బాబు టికెట్లు ఇచ్చారు. వారంతా తాజా ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం పాల‌య్యారు. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దిగారు. వారిద్ద‌రూ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

అయితే.. ఈ చేదు అనుభ‌వం ఒక్క కోట్ల ఫ్యామిలీకే ప‌రిమితం కాలేదు. రాజ‌కీయంగా బ‌ల‌మైన ప‌లు కుటుంబాలు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రించి కేఈ కృష్ణ‌మూర్తి తాను ఎన్నిక‌ల బ‌రినుంచి త‌ప్పుకొని.. త‌న కొడుకు కేఈ శ్యాంబాబును ప‌త్తికొండ నుంచి బ‌రిలోకి దింపారు. త‌న సోద‌రుడు కేఈ ప్ర‌తాప్ ను డోన్ నుంచి బ‌రిలో దింపారు. వీరిద్ద‌రూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల చేతిలో ఓట‌మిపాల‌య్యారు.

ఇదిలా ఉంటే.. ఆళ్ల‌గ‌డ్డ నుంచి మంత్రి అఖిల ప్రియా.. నంద్యాల నుంచి ఆమె సోద‌రుడు భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇదిలా ఉంటే.. జేసీ దివాక‌ర్ రెడ్డి.. ఆయ‌న సోద‌రుడు జేసీ ప‌వ‌ర్ కుమార్ రెడ్డిలు త‌మ కొడుకులు ప‌వ‌న్ కుమార్.. అస్మిత్ రెడ్డిల‌ను బ‌రిలోకి దింపారు. వారిద్ద‌రూ ఓడిపోయారు. సినీ న‌టుడు బాల‌కృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేశ్‌.. చిన్న‌ల్లుడు భ‌ర‌త్ విశాఖ ఎంపీగా బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఇక‌.. బాబు కేబినెట్ లో ప‌వ‌ర్ ఫుల్ మంత్రులుగా చెప్పే గంటా శ్రీ‌నివాస‌రావు విజ‌యం సాధించ‌గా.. ఆయ‌న వియ్యంకుడు నారాయ‌ణ మాత్రం ఓట‌మిపాల‌య్యారు. విజ‌య‌న‌గ‌రం లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయ‌న కుమార్తె అథితి ఓట‌మిపాలు కావ‌టం విశేషం.