Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాల్లో టీడీపీకి షాక్ మీద షాక్

By:  Tupaki Desk   |   23 March 2019 1:05 PM GMT
గోదావరి జిల్లాల్లో టీడీపీకి షాక్ మీద షాక్
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబు బొక్కబోర్లా పడడం ఖాయమని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఆగకుండా సాగుతున్న వలసలూ ఆ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి కీలక నేతలు ఎందరో వెళ్లిపోగా నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న దశలోనూ నేతలు టీడీపీని వీడడం ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరిలో ఒక సిటింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయగా.. పశ్చిమగోదావరిలో మరో సీనియర్ నేత కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు.

తూర్పు గోదావరి జిల్లా - పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టికెట్ ను ఈసారి నెలపూడి స్టాలిన్ బాబుకు కేటాయించడంతో మనస్తాపం చెందిన నారాయణమూర్తి టీడీపీని వీడారు. ఆయన వైసీపీలో చేరుతున్నారు.

మరోవైపు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రుస్తుంబాదలోని గోగులమ్మ ఆలయం వద్ద శుక్రవారం రాత్రి తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కొత్తపల్లి విలేకర్లతో మాట్లాడారు. 24న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మరుసటి రోజు 25వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్ధానానికి నామినేషన్‌ వేస్తానన్నారు.

కాగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని చెప్పినప్పటికీ వైసీపీలో చేరే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీతో టచ్‌ లో ఉన్నట్లు ఆయన చెప్పడమే దీనికి ఉదాహరణ. వైసీపీలో చేరడంపైనా ఆయన ఆదివారం నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అదే జరిగితే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోరని చెబుతున్నారు.