Begin typing your search above and press return to search.

బుట్టా రేణుక‌..జంపింగ్ తేదీ కూడా ఖ‌రారైపోయింది

By:  Tupaki Desk   |   16 Oct 2017 2:31 PM GMT
బుట్టా రేణుక‌..జంపింగ్ తేదీ కూడా ఖ‌రారైపోయింది
X
రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్టి అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాల‌ని భావించిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైస‌పీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ కు ఆదిలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. వైసీపీకి గుడ్‌ బై చెప్పే విష‌యంలో ఎప్ప‌ట్నుంచో ఊగిస‌లాట‌లో ఉన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఈ స‌స్పెన్స్‌కు తెర‌దించేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో బుట్టా రేణుక టీడీపీలో చేరుబోతున్నారు. ఆమెతో పాటు వైసీపీ కేంద్రకమిటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌ రెడ్డి కూడా రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర‌నున్నారు.

పార్టీ మార్పు వార్త‌ల నేప‌థ్యంలో ప్ర‌కాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కోసం బుట్టా రేణుక, నేను చాలా కష్టపడ్డామని ప్రకాష్‌ రెడ్డి అన్నారు. టికెట్‌ కోసం వైసీపీ ముఖ్యనేతలు డబ్బులు అడగడం దారుణమన్నారు. జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌ తో భేటీ అయ్యాక.. పార్టీలో జగన్‌ మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. మ‌రోవైపు పార్టీ ఫిరాయింపు వార్త‌ల నేప‌థ్యంలో బుట్టా రేణుక కూడా త‌న సన్నిహితుల‌తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం జంపింగ్ తేదీ ఖ‌రారు చేసుకున్నారు. రేపు ఉదయం 10గంటలకు రేణుక చంద్రబాబును కలవనున్నారు.

కాగా, రేణుక పార్టీ మార‌డం వెనుక ర‌క‌ర‌క‌లా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాక..ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్‌ సూచించడంతో వైసీపీని వీడేందుకు ఆమె సిద్ధపడినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అంగీకరిస్తే..కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే బుట్టా మాత్రం ఇందుకు ససేమిరా అన్నారట. ఎంపిగానే పోటి చేస్తాన‌ని, ఎమ్మెల్యేగా పోటి చేసే ఉద్దేశం తనకు లేద‌ని కుండబద్దలు కొట్టేశారట. ఈ పరిణామాలతోనే బుట్టా రేణుక త‌న‌దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బుట్టా రేణ‌క భర్త గ‌తంలో చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేణుక కూడా భర్త బాటలో నడిచేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.