Begin typing your search above and press return to search.

బాబుకు మిగిలున్నోళ్లూ ఝలక్ ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Feb 2018 5:54 AM GMT
బాబుకు మిగిలున్నోళ్లూ ఝలక్ ఇస్తున్నారు
X
తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి.. ఈ పార్టీని నేను ఉద్ధరించేస్తా.. ప్రతి రెండు వారాలకు ఓసారి వచ్చి మీటింగు పెట్టుకుంటా.. కనీసం వీడియో కాన్ఫరెన్సులో అయినా మీతో మాట్లాడతా.. పార్టీని మళ్లీ గాడిలో పెడదాం.. అధికారంలోకి తీసువచ్చేద్దాం.. అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశానికి హామీ ఇచ్చి సుమారు మూడు నెలలు గడుస్తున్నట్లుంది. ఇప్పటిదాకా ఒక్క మీటింగు కూడా జరగలేదు.

ఇటీవల ఒకరోజు తెతెదేపా సమావేశం పెట్టుకుంటే.. అదే రోజు ముద్దుకృష్ణమ మరణంతో రద్దయింది. ఈ నెలాఖరు 28 నాటికి మళ్లీ మీటింగు అనుకున్నారు. కానీ అప్పటిదాకా పార్టీలో నాయకులు మిగిలి ఉంటారో లేదో అనేదే అనుమానాస్పదంగా తయారవుతోంది. తాజాగా పార్టీలో ఎంతో సీనియర్లు అయిన కొత్తకోట దయాకర్ రెడ్డి - సీత లు కూడా తమ దారి తాము చూసుకుని .. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వాళ్లు ఢిల్లీలో రాహుల్ భేటీ కాబోతున్నారని.. ఆయన నియోజకవర్గాలకు సంబంధించిన హామీ ఇస్తే మంచి ముహూర్తం చూసుకుని జంప్ చేసేస్తారని తెలుస్తోంది. కొత్తకోట దయాకర్ రెడ్డి - ఆయన భార్య సీత ఇద్దరూ తెలుగుదేశానికి సీనియర్ నాయకులు. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్లే. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. ఇలాంటి సీనియర్లు కూడా వెళ్లిపోతుండడంతో తెతెదేపాలో ఇక మిగిలి ఉన్న వాళ్లెవరో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు అంటున్నారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి - సీత లు దేవరకద్ర - మక్తల్ నియోజకవర్గాలనుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి ఈ నియోజకవర్గాలు కేటాయించడంలో రాహుల్ ఓకే అంటే గనుక.. వారి చేరిక తేదీలు కన్ఫర్మ్ అవుతాయి. వీరు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని కొప్పుల రాజును కలిశారని - టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి తో సహా గురువారమే రాహుల్ తో భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన నాగం జనార్దన రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడం ఖరారైన సంగతి తెలిసిందే. కేవలం ఈ ఒక్క జిల్లానుంచే ఇటీవలి కాలంలో రేవంత్ తో ప్రారంభించి.... అనేక మంది పూర్వ తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు తేలుతోంది.