Begin typing your search above and press return to search.

మంద‌కృష్ణ‌తో రాహుల్ భేటీ..కూట‌మికి శ్రీ‌కార‌మేనా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 2:22 PM GMT
మంద‌కృష్ణ‌తో రాహుల్ భేటీ..కూట‌మికి శ్రీ‌కార‌మేనా?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల వేడి అప్పుడే మొద‌ల‌వుతోంది. పైకి సాధార‌ణ ప‌రిణామాలుగానే ఆయా సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ...ఒక‌దాని వెంట మ‌రొక‌టిగా ముఖ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ స‌న్నిహితుడు, AICC SC సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాడుతున్న ఎంఆర్‌ పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగతో భేటీ అవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మని అంటున్నారు. అంబర్‌ పేట్ డీడీ కాలనీలో గల మంద కృష్ణ స్వగృహంకు విచ్చేసి మ‌రీ స‌మావేశం అవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల వివాహం జ‌రిగిన మందకృష్ణ కుమార్తె అల్లుడును కొప్పుల రాజు గారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు కూడా చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చర్చ పెట్టాలని కోరుతూ మంద కృష్ణ వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేత ప్రధాన మంత్రికి వర్గీకరణ కోరుతూ లేఖ రాయించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం దళితులపట్ల వ్యవహరిసస్తున్న అప్రజాస్వామిక విధానాల పైన మరియు భవిష్యత్ రాజకీయ పరిణామాలు మీద చర్చించిన‌ట్లు ఎంఆర్‌ పీఎస్ వ‌ర్గాలు వెల్ల‌డించారు.

వర్గీకరణ‌పైన మాదిగలను అధికార బీజేపీ మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా - వర్గీకరణ కోసం ఉషా మెహ్ర కమిషన్‌ నియమించిన పార్టీగా కాంగ్రెస్ మౌనంగా ఉండడం సరికాదని మంద కృష్ణ వివరించారు. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు రాహుల్ గాoధీ చేత లేఖ రాయించే ప్రయత్నం చేస్తానని, పార్లమెంట్లోనూ లేవనెత్తతామని కొప్పులరాజు హామీ ఇచ్చారని స‌మాచారం.

ఇదిలాఉండ‌గా..రాబోయే ఎన్నిక‌ల గురించి సైతం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీని ఓడించేందుకు కూట‌మిగా ముందుకు సాగాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్ర‌మంలో మంద‌కృష్ణ‌తో పొత్తుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగా కూట‌మి క‌ట్టేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇది మొద‌టి భేట అని భావిస్తున్నారు.