పొత్తులు ఉండవంటున్న మాస్టారు

Tue Mar 21 2017 09:56:56 GMT+0530 (IST)

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన కార్యాచరణను ఒంటరిగానే ముందుకు తీసుకువెళ్లేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. పలు పార్టీలతో కలిసి ఆయన వేదిక పంచుకుంటున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులతోనే  కోదండరాం ముందుకు వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై కోదండరాం క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల సమయంలో జేఏసీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని అన్నారు. అంతేకాదు తమ వేదిక జాయింట్ యాక్షన్ కమిటీగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

భువనగిరి యాదాద్రి జిల్లాలో టీజేఎసీ- టీవీయువీ ఆధ్వర్యంలో సుధీర్ కమిషన్ రిపోర్టుపై నిర్వహించిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ తో కమిషన్ వేసిందని తెలిపారు. ఆ కమిషన్ మైనార్టీల అభివృద్ధి కోసం 12 సూచనలు చేసిందన్నారు. మైనార్టీలకు సబ్ ప్లాన్ చేయడం 12శాతం రిజర్వేషన్ అమలు చేయడం - వక్ఫ్ ఆస్తులను రక్షించడం - ఉర్దూ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం - ప్రయివేట్ - ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే తదితర అంశాలతో ప్రభుత్వానికి నివేదించిందని వెల్లడించారు. ఈ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. పాలకులు వేసిన కమిషన్లను వారే గౌరవించకపోవడం అప్రజాస్వామికమన్నారు. ఈ బడ్జెట్ లో మైనార్టీలకు కేటాయించిన నిధులు కాకి లెక్కలేనని కోదండరాం విమర్శించారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏ మేరకు విడుదల చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19 కులాలకు హైదరాబాద్ లో  పెద్ద భవనాలు కడతామని - శిలాఫలకాలు వేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అడుగు పునాది తీయలేదని విమర్శించారు. సుధీర్ కమిషన్ లో 12 అంశాలు అమలు చేయాలని పేద బడుగు - బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంగిలి మెతుకులు విసిరిన మాదిరిగా నజరానాలు ప్రకటించడం కాదని సుధీర్ కమిషన్ చేసిన సూచనలు అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/