Begin typing your search above and press return to search.

కొండా సురేఖ మౌనం వెనుక కారణమిదేనా.?

By:  Tupaki Desk   |   2 Sep 2018 10:09 AM GMT
కొండా సురేఖ మౌనం వెనుక కారణమిదేనా.?
X
తెలంగాణలో ఎన్నికల జాతర మొదలైంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ టిక్కెట్ అంటే అదో బంగారు బాతులాంటిదే.. అందుకే ఎవరికి వారు ప్రజల్లోకి వెళుతూ తమకు ఫుల్ క్రేజ్ ను చాటుకుంటున్నారు.. టిక్కెట్ తమకే ఇవ్వాలని అధిష్టానం వద్ద బలం నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కోసం ఇప్పుడు టీఆర్ ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ దిగ్గజాలు బరిలో ఉండడంతో టిక్కెట్ ఎవరికి ఇస్తారనే ప్రశ్న టీఆర్ ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొండా సురేఖ ఉన్నారు. ఆమె భర్త మురళి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే వీరు ఇప్పుడు సైలెంట్ గా ఉండడం అందరినీ నివ్వెరపరుస్తోంది. వరంగల్ తూర్పులో టిక్కెట్ కోసం అందరూ ప్రయత్నిస్తున్న వేళ కొండా సురేఖ మాత్రం స్పందించకపోవడం అంతుచిక్కడం లేదు.

వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ - మాజీ మేయర్ బస్వరాజు సారయ్య - ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావులు టిక్కెట్ రేసులో ముందున్నారట.. ఎవరికి వారు టిక్కెట్ మాదేనన్న విశ్వాసంతో ఉన్నారట.. అయితే మేయర్ నరేందర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారట.. ఎన్నికలకు ఇంకా నెలల ముందే ప్రతీ గడప తొక్కుతూ వారితో కలిసిపోతూ హామీలిస్తూ తనను తాను ప్రజల్లో ఫోకస్ చేసుకుంటారు. దాదాపు తనకే టిక్కెట్ వస్తుందని.. ఎమ్మెల్యేగా గెలవడం గ్యారెంటీ అన్న బజ్ తీసుకొస్తున్నారట..

మేయర్ నరేందర్ జోష్ చూసి టిక్కెట్ ఈయనకే దక్కుతుందని కిందిస్థాయి నేతలు అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ.. నరేందర్ కు అడ్డుచెప్పకపోవడం చూసి ఆమె నియోజకవర్గం మారుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే సైలెంట్ గా ఉంటున్నారా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూశాక.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ టీఆర్ ఎస్ లో జోరుగా సాగుతోంది.