కొణతాల కూడా బాబుకు గట్టి షాకిచ్చారే!

Thu Mar 14 2019 18:55:07 GMT+0530 (IST)

ఉత్తరాంధ్ర బాగు కోసం ఇటీవల స్వరం పెంచేసిన మాజీ మంత్రి సీనియర్ రాజకీయవేత్త కొణతాల రామకృష్ణ.. టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గట్టి షాకిచ్చారనే చెప్పాలి. త్వరలోనే టీడీపీలో చేరి ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో టీడీపీకి మంచి లాభం చేకూర్చనున్నారన్న వార్తల నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన తీసుకున్న నిర్ణయం టీడీపీకి శరాఘాతంగానే తగిలిందని చెప్పక తప్పదు. తన అనుచరులతో భేటీ అయిన కొణతాల... వైసీపీలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ వెళ్లనున్న కొణతాల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.ఇక కొణతాల రాజకీయ ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే.... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కొణతాల.. ఎంపీగానే కాకుండా ఎమ్మెల్యేగా మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండానే ఆయన రాణించారు.  రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొణతాల తన అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎందుకనో గానీ... వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఏ పార్టీతో సంబంధం లేకుండానే సాగిన కొణతాల ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం కట్టుబడే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీలో చేరతారని అందుకు రంగం కూడా సిద్ధమైపోయిందని వార్తలు వచ్చాయి.

ఉత్తరాంధ్ర అభివృద్ది మాటకు కట్టుబడినట్టుగానే వ్యవహరించిన కొణతాల... ఏ పార్టీ అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీలోనే చేరతానని చెప్పారు. తాజాగా ఆయన తన అభిమానులతో సమావేశమై ఇదే అంశంపై సుదీర్ఘంగానే చర్చించారు. కార్యకర్తలంతా ముక్తకంఠంతో వైసీపీ పేరునే వినిపించడంతో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొణతాల తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీకి నిజంగానే శరాఘాతమేనని చెప్పాలి. ఎందుకంటే... అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గడ్ బై కొట్టిన తర్వాత ఆ స్థానం నుంచి పోటీకి దిగే నేత ఎవరూ కనిపించలేదు. ఎవరిని అడిగినా కూడా తమతో కాదనే తేల్చేశారు. ఈ నేపథ్యంలో కొణతాలను పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఆ సీటు ఇస్తే... ఆ సీటుతో పాటు మిగిలిన సీట్లలోనూ లబ్థి పక్కానేనని టీడీపీ భావించింది. అయితే టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేసిన కొణతాల తాను వైసీపీలోకి చేరుతున్నట్లుగా స్పష్టం చేశారు.