Begin typing your search above and press return to search.

ఆ ప్రాజెక్ట్ లో రూ.10వేల కోట్ల అవినీతట

By:  Tupaki Desk   |   23 March 2017 4:47 AM GMT
ఆ ప్రాజెక్ట్ లో రూ.10వేల కోట్ల అవినీతట
X
సాఫీగా సాగుతున్నయన్నట్లుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం హాట్ హాట్ గా సాగాయి. మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య సాగిన సంవాదం ఆసక్తికరంగా మారింది. గ్రామీణనీటి సరఫరా పద్దుపై మంత్రి కేటీఆర్ మాట్లాడిన తర్వాత మాట్లాడిన కోమటిరెడ్డి మాటలతో సభలో ఒక్కసారిగా హాట్ వాతావరణం ఏర్పింది. మిషన్ భగీరథ పథకం మంచిదేనని.. అయితే.. ఇందులో కాంట్రాక్టర్లు తమ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేసి భారీగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సందర్బంగా కొందరు కాంట్రాక్టర్లు రింగ్ గా ఏర్పడిన తీరును చెబుతూ.. ఏ ప్యాకేజీ ఏ కాంట్రాక్టర్ కు కట్టబెట్టారో పేర్లు చదివి వినిపించారు. 26 ప్యాకేజీలుగా సాగుతున్న రూ.32,582 కోట్ల పనుల్లో 30 శాతం మొత్తానికి సబ్ కాంట్రాక్టులకు అప్పజెప్పిన వైనాన్ని కోమటి రెడ్డి ప్రస్తావించారు. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.10వేల కోట్లను ప్రధాన కాంట్రాక్టర్లు దండుకున్నట్లుగా ఆరోపించారు. ఈ అంశంపై సభా సంఘాన్ని వేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా కాంట్రాక్టర్ల దోపిడీ అంటూ ఫైర్ అయిన కోమటిరెడ్డి మాటలకు మంత్రి కేటీఆర్ కల్పించుకొని ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డి ఇదే తరహాలో మాట్లాడారని.. నల్గొండ జిల్లాకు మంచినీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తే.. అక్కడి ప్రజలు హర్షించేవారని.. కానీ.. అది వదిలేసి కాంట్రాక్టర్లు.. సబ్ కాంట్రాక్టర్లు అంటూ మాట్లాడటం దారుణమన్న ఆయన మాటలకు కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ హయాంలో మంచినీళ్ల కోసం 11 రోజులు దీక్ష చేశానని.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నల్గొండకు సాగర్ నీటిని అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించిన విషయాన్ని ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు.

తాను చేపట్టిన ప్రాజెక్టు కారణంగా ఈ రోజున 80 శాతం గ్రామాలకు మంచినీళ్లు అందుతున్న విషయం నిజమో కాదో తెలుసుకోవాలంటూ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఊరికే ఆరోపణలు చేయటంలేదని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్న ఆయన.. ‘‘నేను కానీ ఆరోపణల్నిరుజువు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. రాజకీయాలకు శాశ్వితంగా దూరమవుతా. ఇది నా సవాల్’’ అంటూ తీవ్రంగా స్పందించటంతో వాతావరణం మరింతగా వేడెక్కింది.

ఈ పరిస్థితిలో మరోమారు స్పందించిన మంత్రి కేటీఆర్.. మిషన్ భగీరథలో 0.52 శాతం లెస్ కు టెండర్లు కేటాయించామని.. దీని కారణంగా ప్రజాధనం ఆదా అయినట్లుగా తన వాదనను వినిపించారు. దీనికి కోమటిరెడ్డి స్పందిస్తూ.. ఏదో మాట్లాడుతుండగా..తాను అంకెలు చెబుతుంటే.. కోమటిరెడ్డి రంకెలు వేస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు ఎక్కడ నీళ్లు వస్తాయోనని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేయగా.. మరోమారు కల్పించుకున్న కోమటిరెడ్డి.. ఈ తీరులో మాట్లాడటంమంత్రులకుఫ్యాషన్ అయ్యిందన్నారు. అదే సమయంలో మైకు అందుకున్న మరో మంత్రిహరీశ్ రావు.. ఒక క్లారిఫికేషన్ కోసం కోమటిరెడ్డి ఇన్నిసార్లు మైకు తీసుకొని ఆరోపణలు చేయటం సభా సమయాన్ని వృథా చేయటమంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంత జరిగినా ఈ ఉదంతంపై సభా సంఘాన్ని వేయాలన్న విపక్షాల మాటను అధికారపక్ష నేతలు ససేమిరా అనటం గమనార్హం. సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడిన కోమటిరెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కానీ మరోసారి ముఖ్యమంత్రి అయితే.. తాను ఎమ్మెల్యేగా ఉండనన్నారు. కోమటిరెడ్డి అంటే ఏమిటో ప్రజలకు తెలుసనని.. ప్రజాసమస్యల కోసం ఎలా పోరాటం చేస్తారో.. ఇకపై చూస్తారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/