Begin typing your search above and press return to search.

పరువు హత్యలపై కఠిన చట్టాలు రావాలి

By:  Tupaki Desk   |   22 Sep 2018 8:39 AM GMT
పరువు హత్యలపై కఠిన చట్టాలు రావాలి
X
మిర్యాలగూడలో ‘పరువు’ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వం - కేసీఆర్ పై కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న దారుణ సంఘటనలపై అస్సలు స్పందించని కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. ఫామ్ హౌస్ లోనే ఉంటూ కనీసం సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు ఘటనలో దాదాపు 60 మంది చనిపోయి దేశప్రధాని స్పందించినా కానీ కేసీఆర్ బాధితుల వద్దకు రాకపోవడం విస్మయం కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని కోమటి రెడ్డి హామీ ఇచ్చారు.

*అమృతను పరామర్శించిన సామాజికవేత్త

అమృత తరహాలోనే కుల వివక్షకు తన భర్తను పోగొట్టుకున్న తమిళనాడుకు చెందిన సామిజకవేత్త - శంకర్ భార్య కౌసల్య శుక్రవారం ప్రణయ్ భార్య అమృతను పరామర్శించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. అమృతలాగానే తన భర్తను 2016 మార్చి 13న నా తల్లిదండ్రులు - బంధువులు దారుణంగా హత్య చేశారని.. ఆ దాడిలో తన తలకు 36 కుట్లు పడ్డాయని తెలిపారు. వారిలో ఐదుగురికి మరణశిక్ష; ఒకరికి యావజ్జీవ శిక్ష పడేలా చేశానని కౌసల్య వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అమృతకు సహకరించి భద్రత కల్పించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.