Begin typing your search above and press return to search.

టీపీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ లో పెద్ద కుదుపు

By:  Tupaki Desk   |   24 Jun 2019 9:24 AM GMT
టీపీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ లో పెద్ద కుదుపు
X
తెలంగాణలో మొన్నటి డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తేలిపోయింది. డిసెంబర్ లో రాష్ట్రంలో దక్కని అధికారం.. మే నెలకు వచ్చేసరికి దేశం మొత్తం మీద దక్కకుండా పోయింది. అటు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాహుల్ మొండికేస్తూ దిగిరానంటున్నాడు.

ఈ గొడవల్లో కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పని అయిపోయిందని.. బీజేపీలో చేరడమే మంచిదని వ్యాఖ్యానించి దుమారం రేపాడు. బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ హడావుడిలో ఉండగానే తెలంగాణలో ఓటమికి బాధ్యుడిగా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే పీసీసీ పదవిని ఆశిస్తున్న భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా రంగంలోకి దిగినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలో ముఖ్య నాయకులతో మాట్లాడి తనకు టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పాలని కోరినట్టు సమాచారం. లేకపోతే తనతోపాటు తన తమ్ముడు కూడా పార్టీ మారుతాడని హెచ్చరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పీసీసీ పగ్గాల కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాబీయింగ్ నేపథ్యంలోనే అతడి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని తన తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడని.. అంతకుమించి పార్టీ మారే ఆలోచన అతడికి లేదని వెంకటరెడ్డి వివరణ ఇచ్చాడు. తాము ఇద్దరం ఎప్పటికీ ఒకేపార్టీలో ఉంటామన్నారు. దీన్ని బట్టి టీపీసీసీ పగ్గాలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద కుదుపునే సృష్టిస్తాయని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన చెందుతున్నాయి.