Begin typing your search above and press return to search.

మీరు షోకాజ్ ఇవ్వ‌క్క‌ర్లే..నేనే జ‌వాబు చెప్పేస్తున్నా

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:26 PM GMT
మీరు షోకాజ్ ఇవ్వ‌క్క‌ర్లే..నేనే జ‌వాబు చెప్పేస్తున్నా
X
కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల కూర్పు.. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రాజ్ గోపాల్ రెడ్డితోపాటు మరికొందరు నేతల్లోనూ ఆగ్రహాన్ని తెప్పించింది. నియామకాలను తప్పుబడుతూ...అధిష్టానం పెద్దలపై నిప్పులు చెరిగారు. సూటిగా మాట్లాడే రాజగోపాల్‌ రెడ్డి నేరుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియానే టార్గెట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కుంతియా శనిలా దాపురించారంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్లకు స్థానం కల్పించారని.. కనీసం వార్డు మెంబర్లుగా కూడా గెలవని వారికి కమిటీల్లో చేర్చడమేంటని కుంతియాని నిలదీశారు. కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాల వల్లే... గతంలో అధికారంలోకి రాలేకపోయామని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీచేసింది.

దీనిపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. త‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో స్పందిస్తూ...తాను పార్టీ కార్యకర్తల ఆవేదనను మాత్రమే చెప్పానని అన్నారు. త‌న మాటలు పార్టీ అధిష్టానం అర్థం చేసుకోవాలని తెలిపారు. పార్టీకి నష్టం కలిగించాలని నాకు లేదు నా సూచనలు పరిగణలోకి తీసుకోవాలని రాజ‌గోపాల్‌రెడ్డి విన్న‌వించారు. తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళను పక్కన పెట్టి..ఏనాడు పార్టీ కోసం మాట్లాడని వాళ్ళని కమిటీలో పెట్టారని ఆరోపించారు. ``కేసీఆర్ ని చాలెంజ్ చేసి ఎమ్మెల్సీగా గెలిచాం. మాలాంటి యువకుల్ని పార్టీ ముందుంచాల్సింది పోయి.. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి బాధ్యతలు ఇస్తారా. మాలాంటి వాళ్ళని ఇంట్లో కూర్చోపెడతారా? పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వండి. నాకు షోకాజ్ కాదు. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండు రోజుల గడువు కాదు. రెండు గంటల్లో సమాధానం చెప్తున్నా` అని కోమటరెడ్డి రాజగోపాల్ అన్నారు.

మ‌రోవైపు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజక‌వ‌ర్గంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ను హత్యచేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ``ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యాడు. సచివాలయానికి రాకున్న ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే సీఎం స్పందించాలి. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 60కి పైగా ప్రయాణికులు చనిపోతే ముఖ్యమంత్రి రాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కఠిన చట్టాలను తీసుకువస్తాం` అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.