Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్..టీడీపీలకు ‘గులాబీ’ షాక్

By:  Tupaki Desk   |   30 May 2016 9:47 AM GMT
తెలంగాణ కాంగ్రెస్..టీడీపీలకు ‘గులాబీ’ షాక్
X
తెలంగాణ రాజకీయాల్లో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని తెలంగాణలోని విపక్షాలపై ప్రయోగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా విపక్షాలు ఎంతగా ఇబ్బంది పడుతున్నాయో తెలిసిందే. దానికి కొనసాగింపుగా తాజాగా కాంగ్రెస్.. టీడీపీలకు ఒకేసారి షాక్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ లో సొంత బలంతో సాగే అతి కొద్దిమంది నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ద్వయం ఒకటి. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీకి అతి ముఖ్యనేతలుగా చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ధాటికి పెద్ద పెద్ద నేతలు సైతం కిందామీదా పడుతున్న వేళ.. కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ కు చిన్నపాటి షాక్ ఇచ్చిన ఏకైన నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను చెప్పాలి.

స్థానికంగా అంతటి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి.. టీఆర్ ఎస్ లో చేరాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల కమిట్ మెంట్ ప్రదర్శించే ఈ సోదరులపై ఇప్పటికే పలుమార్లు టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చినా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఖాయమంటున్నారు. మరికొద్ది వారాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారని.. ఇందుకు సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన బ్రదర్స్.. కారు ఎక్కేందుకు డిసైడ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే.. మరోవైపు తెలంగాణ తెలుగుదేశంలో అరకొరగా ఉన్న బలం కూడా తాజా పరిణామంతో మరింత తగ్గిపోనుంది. మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి సైకిల్ దిగేసి.. కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ అయిన మల్లారెడ్డి తెలంగాణ అధికారపక్షంలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచర వర్గంలో ఆయన భేటీ అయి.. పార్టీ మారే అంశాన్ని వారితో చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. జూన్ 2న కారు ఎక్కేందుకు ముహుర్తం కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు గులాబీ కారు ఎక్కేందుకు రెఢీ కావటం రెండు పార్టీలకు షాకింగ్ అని చెప్పక తప్పదు.