Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రో పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:57 AM GMT
కేసీఆర్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రో పాద‌యాత్ర‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నిక‌ల్లో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా ర్యాలీలో కోమటిరెడ్డి బ్రదర్స్ స్వయంగా 8 కిలో మీటర్లు బైకు నడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయకుండా ప్రజలను మోసగించారన్నారు. కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ తాము త్వరలోనే పాదయాత్ర చేపడుతామని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ ప్రకటించారు. కాగ‌, ఇప్ప‌టికే సీపీఎం ఆధ్వ‌ర్యంలో కేసీఆర్ ప‌రిపాల‌న వైఫ‌ల్యాల‌పై ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం రాష్ట్ర వ్యాప్త పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తమ పాదయాత్రతో కాంగ్రెస్ బలోపేతమై టీఆర్‌ఎస్ ఖాళీ కావడం ఖాయమని కోమ‌టిరెడ్డి సోద‌రులు ధీమా వ్య‌క్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను 100 సీట్లలో గెలిపించి తెలంగాణలో అధికారంలోకి తెస్తామని ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా పనిచేసిన జేఏసీ చైర్మన్ కోదండరాంను అక్రమంగా టీఆర్‌ ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయించడం బాధకరమన్నారు. ఉద్య‌మాల ద్వారా అధికారంలో వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌ని ఆందోళ‌న చేస్తున్న వారిని అరెస్టు చేయ‌డం ఆయ‌న నియంతృత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. లక్ష ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమబాట పట్టడానికి కేసీఆర్ కారణమయ్యారన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో గొప్ప‌లు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వాటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్వ‌యంగా ఆర్బాటంగా ప్ర‌క‌టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమి, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు, తండాల ఏర్పాటు, కెజి టూ పిజి విద్య వంటి ఏ హామీలను కూడా టీఆర్‌ఎస్ అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతులకు సక్రమంగా అందించలేదని, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఇలా అన్నిరంగాల్లో విఫ‌ల‌మై, కుటుంబ పాల‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన కేసీఆర్ ప్ర‌భుత్వ తీరుతెన్నుల‌కు ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు తాము పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ వ్యాప్తంగా సాగే ఈ యాత్ర‌లో కేసీఆర్ ప‌రిపాల‌న వ‌ల్ల తీవ్ర క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న వ‌ర్గాలంద‌రినీ క‌లుస్తామ‌ని తెలిపారు. వారిలో భ‌రోసా నింపుతామ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ శ్రేణుల‌తో మ‌మేక‌మ‌యి పార్టీకి పూర్వ‌వైభవం తెచ్చేందుకు ముందుకు సాగున్న‌ట్లు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/