Begin typing your search above and press return to search.

కోమటి బ్రదర్స్ : వాళ్లకు వాళ్లే అధిష్టానం!

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:34 PM GMT
కోమటి బ్రదర్స్ : వాళ్లకు వాళ్లే అధిష్టానం!
X
కాంగ్రెస్ పార్టీలో స్వామిని మించిన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు నాయకులు. సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినా - కొమ్ములు తిరిగిన నాయకుల సీట్లను కేటాయించినా.. అంతా జాబితాలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం మమ అన్న తరువాత గానీ.. ప్రకటించడం జరగదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటరెడ్డి బ్రదర్స్ తీరే వేరు. ‘తమకు తామే అధిష్టానం.. తాము చెప్పిందే శాసనం.. తాము తలచిందే.. తమ సీటు’ అన్నట్లుగా వారు సంకేతాలు ఇస్తున్నారు. పార్టీలో సంప్రదింపుల్లేవు - నాయకుల అనుమతి తీసుకోవడం లేదు - అధిష్టానానికి ప్రతిపాదించడం అసలే లేదు.. వారికి వారే.. వచ్చే ఎన్నికల్లో తాము ఎక్కడెక్కడినుంచి పోటీ చేయదలచుకుంటున్నామో.. నియోజకవర్గాలను ఎలా మార్చుకోదలచుకుంటున్నామో.. తమ కుటుంబం నుంచి ఇంకా ఎవరు ఎన్నికల బరిలో కాలుపెట్టబోతున్నారో.. సమస్తం తమంత తాము ఏక పక్షంగా ప్రకటించేస్తున్నారు.

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. హత్యకు గురైన తన అనుచరుడు శ్రీనివాస్ భార్యను నల్గొండ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది కానీ - ఇప్పుడు ఆ సంగతి ధ్రువీకరించడం లేదు. తాను మాత్రం ఎంపీగా నల్గొండ బరిలో ఉంటానని అంటున్న ఆయన, ఎమ్మెల్యేగా బీసీ వర్గం వారు ఉంటారని మాత్రం చెప్పారు.

అదే సమయంలో.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి ఎంపీసీటు మీదే కన్నేసినట్లు కనిపిస్తోంది. భువనగిరి ఎంపీ స్థానం నుంచి తాను పోటీచేస్తానని - లేకుంటే మునుగోడు అసెంబ్లీ సీటుకు బరిలో ఉంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. తాను గనుక భువనగిరి ఎంపీ బరిలో ఉంటే.. మునుగోడు నుంచి తన భార్య బరిలోకి ప్రవేశిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. నిజానికి కోమటిరెడ్డి కుటుంబం నుంచి రాబోయే ఎన్నికల్లో మూడో వ్యక్తిగా రాజగోపాల్ కొడుకు రంగప్రవేశం చేస్తాడని అంతా అనుకున్నారు గానీ, ఆయన భార్య పేరును ప్రకటించడం విశేషం.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు బాగానే ఉన్నదనడంలో సందేహం లేదు. అయితే వారు పార్టీలో మరో నాయకుడిని సంప్రదించడంతో నిమిత్తం లేకుండా తమకు తామే టికెట్లు ఇచ్చేసుకున్నట్లుగా ఏకపక్షంగా ప్రకటించేసుకోవడం మాత్రం కొందరికి కంటగింపుగా ఉంది. ఈ మేరకు పితూరీలతో సిద్ధమవుతున్నట్లు కూడా గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.