నేను గెలుస్తా...మీ అందర్నీ బట్టలూడదీసి కొడతా

Tue Dec 04 2018 23:02:28 GMT+0530 (IST)

తెలంగాణ ప్రచార పర్వంలో అనేక పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. అదే రీతిలో పలు వివాదస్పద పరిణామాలు సైతం తెరమీదకు వస్తున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలకలం రేపే కామెంట్లు చేశారు. ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగలడంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  నాంపల్లి మండలం తుంగపాడ్ గ్రామంలో మంగళవారం ఆయన ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు తిరగబడ్డారు. గతంలో ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన సందర్భాల్లో ప్రజలు నిలదీస్తుండడంతో ఏం చేయాలో తోచని కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రజలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత నాకు వ్యతిరేకంగా పని చేసినోళ్లందరి బట్టలూడదీసి ఊరేగిస్తా అంటూ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీగా ఐదు సంవత్సరాలు పని చేసినప్పటికీ కనీసం నియోజకవర్గానికి కన్నెత్తి కూడా చూడకుండా .. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావంటూ స్థానికులు నిలదీశారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అందరి సంగతి తేలుస్తానని బట్టలూడదీసి ఊరేగిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో స్థానికులు  నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో  పోలీసులు గ్రామస్తులపై స్వల్ప లాఠీచార్జి చేసి రాజగోపాల్‌రెడ్డిని ఆ ఊరి నుంచి పంపించి వేశారు.