Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు...నెంబ‌ర్ వ‌న్ విలనేన‌ట‌!

By:  Tupaki Desk   |   21 Feb 2018 12:01 PM GMT
చంద్ర‌బాబు...నెంబ‌ర్ వ‌న్ విలనేన‌ట‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఇప్పుడు ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మిత్ర‌ప‌క్షం బీజేపీ స‌హా విప‌క్షాల‌న్నీ కూడా చంద్ర‌బాబుపై ఒంటికాలిపై లేచి ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. చంద్ర‌బాబు జ‌మానా అవినీతి జ‌మానాగా మారిపోయింద‌ని మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన సీనియ‌ర్ మోస్ట్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎప్ప‌టిక‌ప్పుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. అస‌లు చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీ అవినీతిలో దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న అనుమానాల‌ను కూడా ఆయ‌న వ్య‌క్తం చేసిన వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డిపోయిన ఏపీని గ‌ట్టెక్కించాలంటే.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతో పాటుగా వీలైన‌న్ని మేర జాతీయ సంస్థ‌లు - రాయితీల‌ను ప్ర‌క‌టించాల‌న్న వాద‌న మిద‌టి నుంచి వినిపిస్తున్న‌దే. అయితే చంద్రబాబు వ్య‌వ‌హార స‌ర‌ళి కార‌ణంగానే ఏపీకి రావాల్సిన ప్ర‌త్యేక హోదా స‌హా అన్ని రాయితీల‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు గండి కొట్టేస్తోంద‌ని అన్ని రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ఏపీని మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేస్తున్న చంద్ర‌బాబు... అస‌లు తెలుగు నేల విభ‌జ‌న‌కు కూడా ఆద్యుడు చంద్ర‌బాబేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల‌ని తొలుత కేంద్రానికి లేఖ రాసింది టీడీపీనేన‌ని - ఆ లేఖ‌ను చంద్ర‌బాబే స్వ‌యంగా కేంద్రానికి పంపార‌ని కూడా గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఇదే విష‌యాన్ని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి జ‌నానికి గుర్తు చేసేందుకు ఏమాత్రం వెనుకాడ‌ని విప‌క్షాలు చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయ‌నే చెప్పాలి. అంటే నాడు రాష్ట్ర విభ‌జ‌న‌కు ఆద్యుడిగా నిల‌వ‌డంతో పాటుగా నేడు ఏపీకి క‌ష్టాల‌ను కొని తెచ్చిన నేత‌గానూ చంద్ర‌బాబును విప‌క్షాలు అభివ‌ర్ణించేస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో విప‌క్షాల వాద‌న కాస్తంత బలంగానే వినిపిస్తున్నా... దీనిని కొట్టిపారేయ‌డానికి టీడీపీ సాహ‌సం చేయ‌డం లేదంటే... అందులో వాస్త‌వ‌ముంద‌ని న‌మ్మ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ఇప్పుడు ఈ విష‌యం ఎంద‌క‌న్న విష‌యానికి వ‌స్తే... చంద్ర‌బాబు చారిత్ర‌క త‌ప్పిదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నం ముందు పెడుతున్న వైసీపీ ఇప్పుడు కూడా బాబును అడ్డంగా బుక్ చేసేసింది. వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ కేంద్రంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబుపై ఇవే విమ‌ర్శ‌ల‌ను సంధించారు. అంతేకాకుండా ఏపీకి అన్ని ర‌కాలుగా న‌ష్టం జ‌రిగేందుకు కార‌ణ‌మైన చంద్ర‌బాబును ఆయ‌న విల‌న్‌ గా - నెంబ‌ర్ వ‌న్ విల‌న్‌ గా అభివ‌ర్ణించారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినా.. నేడు బీజేపీ అన్యాయం చేస్తున్నా.. దీనికి కారణం చంద్రబాబేనని ఆయ‌న ఆరోపించారు. అప్పుడు కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్ర‌బాబు... ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాడని ఆయన విమర్శించారు. దేశంలోనే సీనియర్‌ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు విశ్వసనీయతలో అథముడన్న విష‌యం ప్రత్యేక హోదా విషయంలో స్పష్టంగా అర్థమైందని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేది ఒక్క చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్‌ అని ఇన్నాళ్లు మభ్యపెట్టారని, ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. రాజధానిని రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి భూములు దోచుకున్నారని, తన స్వార్థం, కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేజిక్కించుకున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. అఖిల సంఘం పేరుతో కొత్త డ్రామాలు ఎందుకు? హోదా కంటే ప్యాకేజీ మేలు అని చెప్పినప్పుడు అఖిలపక్షం గుర్తుకురాలేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ బావుంది అని అర్థరాత్రి మీడియాకి చెప్పే సమయంలో అఖిలపక్షం గుర్తుకు రాలేదా అని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రా లేక టీడీపీ సీఈవోనా అని ప్రశ్నలు సంధించారు. పవన్‌ కల్యాణ్‌ పేరుతో చంద్రబాబు మళ్లీ డ్రామాలు చేస్తున్నారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేరని.. అబద్ధాలు, మోసాలు, మాటలు మారుస్తున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు.