Begin typing your search above and press return to search.

లోకేశ్ ఏమైనా వజ్రమా?అని కోడెల బాబునే ప్రశ్నించారట..

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:06 PM GMT
లోకేశ్ ఏమైనా వజ్రమా?అని కోడెల బాబునే ప్రశ్నించారట..
X
టీడీపీ అధినేత చంద్రబాబుపై కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి విరుచుకుపడ్డారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య విషయంలో చంద్రబాబుది మొసలి కన్నీరని ఆయన విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు మాటతీరు మారిపోయిందని - చిలుక పలుకులు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు బాగా నటించారని - ఆయన నటనంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.

కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు రెండు వేళ్లు చూపించడం ఏమైనా బాగుందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోడెలను పిలిచి ‘‘మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది - అతడ్ని అదుపులో పెట్టండి’’ అంటూ హెచ్చరించారని.. అందుకు కోడెల ఘాటుగా స్పందిస్తూ ‘‘మీ పుత్రరత్నం ఏమన్నా వజ్రమా?’’ అంటూ ప్రశ్నించారని ముద్రగడ తన లేఖలో అన్నారు.

పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని.. కానీ, దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అంటూ ముద్రగడ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని.. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్‌ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు.