Begin typing your search above and press return to search.

కోడెలను టీడీపీ నుంచి సస్పెండ్ చేద్దామనుకున్నారా?

By:  Tupaki Desk   |   16 Sep 2019 8:27 AM GMT
కోడెలను టీడీపీ నుంచి సస్పెండ్ చేద్దామనుకున్నారా?
X
అనుమానాస్పద స్థితిలో మరణించిన కోడెల శివప్రసాద్ రావు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కోడెల మరణంపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. వారిలో కొందరు రాజకీయ ప్రస్తావన తీసుకు వస్తూ ఉన్నారు. కోడెలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని.. అందుకే ఆయన మరణించారని టీడీపీ వాదిస్తూ ఉంది. అయితే కోడెలది ఆత్మహత్యా? లేక ఆయన గుండెపోటుకు గురయ్యారా? అనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రాజకీయ నేతగా ఎన్నో ఎత్తుఫలాలు చూసిన కోడెల ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని ఉంటారని చాలా మంది నమ్మడం లేదు.

రాజకీయంగా ఓటమి, గెలుపులు కోడెలకు కొత్త కాదు. వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారాయన. అలాంటిది ఇప్పుడు ఓటమి, కేసులకు భయపడి ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారా? అనేది సందేహమే. ఈ అంశంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

అయితే ఇప్పుడు మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. అదే కోడెలను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన చేశారనేది. గత కొన్నాళ్లుగా కోడెల ఎదుర్కొన్న పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వని సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. అయితే కోడెల విషయంలో మాత్రం టీడీపీ వాళ్లు స్పందించలేదు. ఆయన పేరెత్తడానికే వారు సాహసించలేదు.

అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో అయితే.. కోడెల తీరునే టీడీపీ వాళ్లు తప్పుపట్టారు కూడా! కోడెలను సస్పెండ్ చేయాలని, తద్వారా గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్టుగా అవుతుందని కూడా తెలుగుదేశం వాళ్లు ఆలోచించారట! కొందరి మీద చర్యలు తీసుకోవాలని.. అప్పుడు పార్టీ ఇమేజ్ పెరుగుతుందని, అందుకే కోడెల పరివారంపై చర్యలు తీసుకోవాలని మంత్రాంగం సాగిందట. అలా తెలుగుదేశం పార్టీ కోడెలకు ఎలాంటి సహకారం ఇవ్వకపోవడంతో పాటు, ఆయనను పార్టీ నుంచి వదిలించుకోవాలని కూడా ఆలోచించినట్టుగా తేటతెల్లం అయ్యింది. ఆయన మరణంతో ఆ అంశం పై కూడా చర్చ మొదలైంది.