టీడీపీ మీటింగులో స్పీకర్ కోడెల

Mon Jul 17 2017 15:14:13 GMT+0530 (IST)

స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన హాజరవడంపై విమర్శలు కురుస్తున్నాయి.
    
కోడెల ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు.... తెలుగుదేశం శాసనసభా పక్ష పార్టీ సమావేశానికి కూడా వెళ్లారు. దీంతో స్పీకర్ గా ఉంటూ ఆయన ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏ స్పీకర్ కూడా ఇలా పార్టీ సమావేశాల్లో పాల్గొన్న సందర్భం లేదని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.
    
స్పీకర్  ఏ పార్టీకి చెందిన వ్యక్తయినా కూడా ఆ స్థానానికి వెళ్లిన తరువాత పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పార్టీ కార్యకలాపాల్లో ఉండరాదు. అలా చేస్తే ఆ స్థానాన్ని చులకన చేసినట్లే. కానీ కోడెల మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఏకంగా పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లడంపై అంతా నోరెళ్లబెడుతున్నారు.
    
గతంలోనూ కోడెల పలు అంశాల్లో విమర్శలకు గురయ్యారు. టీడీపీ పక్షపాతి అంటూ విపక్షాలు విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి తన తీరు బయటపెట్టుకున్నారు.