Begin typing your search above and press return to search.

ఆ ఒక్క‌టి త‌ప్ప కోదండ‌రాంకు అంతా ఓకేన‌ట‌

By:  Tupaki Desk   |   17 Oct 2018 6:12 PM GMT
ఆ ఒక్క‌టి త‌ప్ప కోదండ‌రాంకు అంతా ఓకేన‌ట‌
X
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న జెండా ఎగుర‌వేసిన తెలంగాణ జనసమతి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐల‌తో క‌లిసి కూట‌మి క‌ట్టిన కోదండ‌రాం ఈ క్ర‌మంలో ఒకింత గంద‌ర‌గోళంలో ప‌డ్డార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న ఓ మీడియా సంస్త‌తో మాట్లాడుతూ ప్ర‌స్తుత ఎన్నిక‌లు, త‌మ రాజ‌కీయ ప్ర‌యాణం పై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ నిరంకుశ పాలనను అంతం చేస్తామని అధికారంలోకి వస్తే అమర వీరుల ఆశయాలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధిస్తామని చెప్పారు.

ప్రధాన శక్తులు కలిస్తే తప్ప కేసీఆర్‌ నిరంకుశ పాలనను అడ్డుకోలేరనే అభిప్రాయంతో తెలంగాణ సమాజం ఉంద‌ని, అందువల్లే ఇతర శక్తులతో కలిసి మహాకూటమిగా ఏర్పాడ్డామ‌ని కోదండ‌రాం తెలిపారు. దీన్ని ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా చూడవలసిన అవసరం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ``ఒక ఎజెండాకు బాగా ప్రాచూర్యాన్ని కల్పించడంలో గానీ, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోగానీ, దానికి మద్దతు కూడబెట్టడం వంటి అంశాలన్నింటికీ పొత్తు అనేది చాలా అవసరం. అదేవిధంగా ఎజెండా అమల్లో కూడా ఒక పాత్ర పోషించాలంటే పొత్తు చాలా కీలకం. అదే విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం. పొత్తుల ద్వారా ఎక్కువ బలాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం`` అంటై వివరించారు. మహాకూటమిలో టీజేఎస్‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానం ద‌క్క‌డం లేద‌నే అంశం గురించి ప్ర‌శ్నించారు. ``టీజేఎస్‌ రెండు మూడు అంశాల్లో ప్రధాన పాత్ర పోషించ‌నుంది. ఎజెండా తయారీలో ఒక అవకాశంతోపాటు ఎజెండా అమల్లో కూడా మాకు భాగస్వామ్యం ఉంటుంది. మూడోది గౌరవ ప్రదమైన ప్రాతినిథ్యం. ఈ మూడింటిని మేం కోరుతున్నాం. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి అమలు ప్రక్రియ రెండింటికి ఒప్పుకున్నారు. మూడోది కూడా ఒప్పుకుంటారని భావిస్తున్నాం`` అని కోదండ‌రాం వెల్ల‌డించారు.

రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని కోదండ‌రాం పేర్కొన్నారు. `అక్షరాస్యతలో ఆఖరు నుంచి మూడో స్థానం, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం, నిరుద్యో గంలో మూడో స్థానం, ఇలా.. అస్సాం, జమ్మూకాశ్మీర్‌ కంటే దిగజారిపోయాం` అని కోదండ‌రాం విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అభివృద్ధి అని..ఆ విషయంలో నాలుగేళ్ల‌లో జరిగింది ఏమీలేదని, త‌మ కార్యాచ‌ర‌ణ ఈ దిశ‌గా ఉండ‌ద‌నుంది ఆయ‌న పేర్కొన్నారు.