Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి క‌లుస్తామంటున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   23 Feb 2017 10:28 AM GMT
రాష్ట్రప‌తి క‌లుస్తామంటున్న కోదండ‌రాం
X
నిరుద్యోగ ర్యాలీ - త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ నేప‌థ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం త‌న నివాసంలో జేఏసీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముంద‌స్తు అరెస్టులు చేసినా...తలుపులు బద్దలు కొట్టి లాక్కెల్లిన‌ప్ప‌టికీ నిరుద్యోగ నిర‌స‌న ర్యాలీని తెలంగాణ వాదులు పూర్తి చేశార‌ని కోదండ‌రాం తెలిపారు. తాము అనుకున్న అంశం పై పెద్ద ఎత్తున చర్చ నడిచిందని ఈ ర‌కంగా తాము సంపూర్ణ విజయం సాధించామ‌ని విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు సంఘీభావం ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. త‌మ‌ను కలవడానికి వచ్చిన సీనియర్ నాయకులను కూడా అరెస్ట్ చేయటం దుర్మార్గమ‌ని కోదండ‌రాం మండిప‌డ్డారు. విద్యార్థులతో మరోసారి మాట్లాడి, భవిష్యత్ కార్యాచరణ చేపడ్తామ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీలో ఉద్యోగాల క‌ల్ప‌న‌పై చర్చ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎమ్మెల్యేల‌కు వివరాలు ఇస్తామని కోదండ రాం తెలిపారు.

రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యల‌ను విన్న‌వించేందుకు రాష్ట్రపతి అపాయింట్‌ మెంట్ కోరిన‌ట్లు కోదండ‌రాం తెలిపారు. తాము త్వ‌ర‌లోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామ‌ని చెప్పారు. సుధీర్ కమిటీ సూచనలు అమలు చేయాలని అన్ని జిల్లాల్లో స‌మావేశాలు ఏర్పాటు చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మార్చి 1న మహబూబ్ న‌గర్, 4న నిజామాబాద్ లో ఉంటుంద‌ని చెప్పారు. స్వామి అగ్నివేశ్ నిరుద్యోగ ర్యాలీ సంద‌ర్భంగా జ‌రిగిన‌ ఘటనను ఖండించారని, జేఏసీకు అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు. స్వ‌రాజ్ పార్టీ నేత‌లు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు త‌మ‌కు ఫోన్ చేసి నిన్నటి ఘటనను అరా తీశారని కోదండ‌రాం వివ‌రించారు. ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అని ప్రభుత్వాలు భావిస్తాయని అయితే... జేఏసీ గాలికి ఊదితే పోయేది కాదని స్ప‌ష్టం చేశారు. జేఏసీ నిలబడుతుంద‌ని, ప్ర‌శ్నిస్తుంద‌ని తేల్చిచెప్పారు. మూడు నాలుగు రోజుల్లో జాక్ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చి ప్రకటిస్తామ‌ని తెలిపారు. ఇక జేఏసీ స‌మావేశం సంద‌ర్భంగా కో క‌న్వీన‌ర్ పిట్ట‌ల ర‌వీంద‌ర్ బాయ్ కాట్ చేయ‌డంపై కోదండ‌రాం స్పందిస్తూ జేఏసీ లో ఏలాంటి లుకలుకలు లేవ‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/